ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో పెహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ, ఇది కేవలం పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, అది మానవత్వంపై, కశ్మీరీ ప్రజలపై పాకిస్థాన్ చేసిన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీనాబ్ నదిపై నిర్మించిన కీలక వంతెనను ప్రారంభించిన తర్వాత, వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపిన సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యాటక రంగంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజల జీవితాలను పాకిస్థాన్ బలి తీసుకుందన్నారు.
పర్యాటక రంగాన్ని ధ్వంసం చేసేందుకు పాక్ కుట్ర
పర్యాటక రంగం కశ్మీర్‌లో వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇది కేవలం వాణిజ్యమే కాదు, విభిన్న మతాల మధ్య సంబంధాలను బలపరచే ఆధారం కూడా. అలాంటి శాంతి, అభివృద్ధికి ప్రతినిధిగా ఉన్న ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, పాక్ దుష్ట ఆలోచనలకు నిదర్శనం అని మోదీ అన్నారు.
ఏప్రిల్ 22న పెహల్గామ్ ఘటనపై స్పందన
ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ.. కశ్మీర్ ప్రజల ఆదాయ మార్గాన్ని నాశనం చేయడానికి పాకిస్థాన్ ఈ దాడికి పాల్పడిందని అన్నారు. ఇది కేవలం పర్యాటకులను భయపెట్టడం మాత్రమే కాదు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు, అభివృద్ధికి అడ్డుపడే చర్య అని మోదీ అన్నారు.
పాక్ మానవత్వానికి శత్రువు
మానవత్వానికి, సామరస్యానికి, అభివృద్ధికి పాకిస్థాన్ శత్రువుగా మారిందని మోదీ వ్యాఖ్యానించారు. పేద ప్రజలు జీవించాల్సిన అవకాశాలను కూడా లాగేస్తున్నారంటూ మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
