బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి విడుద‌ల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. భార‌త్‌, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు వివాదాల‌ను ఆయ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందంటే..

కాంగ్రెస్ హయాంలో జాతీయ భద్రతా లోపాలు

భారతీయ జనతా పార్టీ (BJP) చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పాలనలన్నీ జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని ఆరోపించారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం కాంగ్రెస్ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల ప్రవేశాన్ని 65 ఏళ్ల పాటు అడ్డుకోలేదని తెలిపారు.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు పరిష్కారం ఆలస్యానికి కారణం ఎవరు?

భారత్‌లో 111 చిన్న ఎంక్లేవ్‌లు బంగ్లాదేశ్‌లో ఉన్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్‌కి చెందిన 51 ఎంక్లేవ్‌ ప్రాంతాలు భారత్‌లో ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్వేశ్వర్ రెడ్డి, ఇందిరా గాంధీ ‘ఐరన్ లేడీ’ అనే పేరున్నా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించలేకపోయారని అన్నారు.

మోదీ హయాంలో సరిహద్దు పరిష్కారం

2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినాతో కలిసి ఈ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. మే 28, 2015న 100వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చి రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దును స్థిరపరిచారు.

YouTube video player

జెసోర్, ఖుల్నా విషయంలో నెహ్రూ తప్పుడు నిర్ణయం?

పశ్చిమ బెంగాల్‌లోని హిందూ మెజారిటీ ఉన్న జెసోర్, ఖుల్నా పార్లమెంట్ నియోజకవర్గాలు పాకిస్థాన్‌లో కలిసిపోయేలా చేశారని, ఇది నెహ్రూ తప్పుడు నిర్ణయమని ఆరోపించారు. అసలు ఆ ప్రాంత ప్రజలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ను ఎంపీగా ఎన్నుకున్నారు, కానీ నెహ్రూ ఈ విషయం వ్యతిరేకించి, అంబేద్కర్‌ను పార్లమెంట్‌కి రాకుండా చేయడానికి పాకిస్థాన్‌లో కలిపేశారని ఆరోపణలు చేశారు. మ‌రి విశ్వేశ్వ‌ర రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.