భార‌త ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ హ‌ఠాత్తుగా రాజీనామా చేయడం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. కాగా తొలిసారి రాజీనామాపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. 

భార‌త ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ రాజీనామాపై స్పందించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. "శ్రీ జగదీప్ ధన్‌కడ్ జీ ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేసే అవకాశాలు పొందారు. ఆయన ఉపరాష్ట్రపతి స్థాయిలో కూడా దేశానికి సేవ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను". అని మోదీ రాసుకొచ్చారు. అయితే జ‌గ‌దీప్ రాజీనామాకు అస‌లు కార‌ణం ఏంట‌న్న విష‌యాన్ని మోదీ కూడా ప్ర‌స్తావించ‌లేదు.

కాగా 2025 జూన్ 25న ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి కుమాయున్ యూనివర్సిటీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన తర్వాత అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన పక్కన ఉన్న 1989లో నైనితాల్ ఎంపీగా పనిచేసిన మహేంద్ర సింగ్ పాల్‌పై తల వాల్చి ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. వెంటనే వైద్య సిబ్బంది చికిత్స‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత జ‌గ‌దీప్‌ను రాజ్‌భవన్‌కు తరలించారు.

Scroll to load tweet…

ధన్‌కడ్ రాజీనామా చేసిన రోజు నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారా.? లేక కొత్తగా మరో పదవి స్వీకరించనున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. ధన్‌కడ్ రాజీనామా అనంతరం ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి కొత్తగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఈ అనూహ్య పరిణామం వెనుక రాజకీయ కోణం ఉందా? అన్న సందేహాలు వ‌స్తున్నాయి.