- Home
- Telangana
- School Holiday: స్కూళ్లు నడిచేది ఇవాళ ఒక్కరోజే, మళ్లీ రేపు సెలవు.. బుధవారం ఎందుకంటే.?
School Holiday: స్కూళ్లు నడిచేది ఇవాళ ఒక్కరోజే, మళ్లీ రేపు సెలవు.. బుధవారం ఎందుకంటే.?
ఇటీవల తెలంగాణలో వరుస సెలవులు వస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో పాటు వర్షాల కారణంగా గత వారం స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కాగా బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

గతవారం వరుస సెలవులు
తెలంగాణలో గతవారం విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయి. శనివారం మొదలైన సెలవులు సోమవారం వరకు కొనసాగాయి. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత శనివారం హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ఆ తర్వాత ఆదివారం ఎలాగో సెలవు లభించింది. కాగా సోమవారం బోనాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంది. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. కాగా రేపు (బుధవారం) కూడా రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు, స్కూళ్లు మూతపడనున్నాయి.
కారణం ఏంటి.?
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరత వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం విద్యా సంస్థలు మూత పడనున్నాయి. అసలు వీరి డిమాండ్లు ఏంటంటే.
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీపై చట్టం
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల పేరిట జరుగు దోపిడీపై ఇప్పటివరకు సరైన నియంత్రణ చట్టం రాకపోవడం దురదృష్టకరమని ఏఐవైఎఫ్ నేతలు పేర్కొన్నారు. అనేకసార్లు విద్యార్థి సంఘాలు పోరాటాలు చేసినా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ దోపిడీని నియంత్రించేందుకు తక్షణమే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, ఎంఇఓలు, డీఈఓలు వంటి కీలక పదవులను వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం వల్ల విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి లోనవుతోందని, దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని విమర్శించారు.
ఉపకార వేతనాల విడుదల డిమాండ్
ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రూ. 8,000 కోట్ల విద్యార్థి ఉపకార వేతనాల బకాయిలు, బోధనా రుసుములను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేసి, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ఉచిత బస్ పాస్‌తో పాటు
విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించడంతోపాటు, నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే “యూత్ డిక్లరేషన్”ను ప్రకటించి యువత భవిష్యత్తును అర్థవంతంగా తీర్చిదిద్దే విధంగా పాలకులు ముందడుగు వేయాలని కోరారు.
బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు
జూలై 23న జరగబోయే పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు పూర్తిగా మద్దతునివ్వాలని ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏఐవైఎఫ్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు.