- Home
- Telangana
- Adulterated Liquor: బయటకే కాస్ట్ లీ బ్రాండెడ్ సీసాలు లోపల మాత్రం విషం.. మద్యం బాబులకు షాకింగ్ న్యూస్
Adulterated Liquor: బయటకే కాస్ట్ లీ బ్రాండెడ్ సీసాలు లోపల మాత్రం విషం.. మద్యం బాబులకు షాకింగ్ న్యూస్
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మందు బాబులు మాత్రం ఆ అలవాటును మానుకోరు. పైగా కాస్లీ మద్యం తాగుతున్నాం మాకేంటి అన్న భావనలో ఉంటారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తెలిస్తే దడుసుకోవాల్సిందే.

ఒరిజినల్ సీసాలో నకిలీ మద్యం
ఎక్కువ ధరకు లభించే బ్రాండ్స్ మద్యాన్ని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. అందులోనూ కాస్లీ మద్యం తాగితే ఆరోగ్యంపై ప్రభావం తక్కువగా పడుతుందని భావిస్తుంటారు. ఇదిగో దీనినే కొందరు కేటుగాళ్లు తమ దందాకు వాడుకున్నారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలోని గోదాంలో పెద్దఎత్తున నకిలీ మద్యం తయారీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మంచి, మంచి బ్రాండెడ్ ఖాళీ బాటిళ్లు సేకరించి వాటిలో నీళ్లు, స్పిరిట్, కొంత మద్యం కలిపి మళ్లీ సీల్ వేసి అమ్ముతున్నారు. బయటకి చూస్తే అసలైన సీసాలే.. కానీ లోపల మాత్రం విషంతో సమానమైన మద్యం ఉంటుంది.
ఏకంగా 178 బ్రాండ్ల మద్యం కల్తీ
ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సంఖ్య తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 178 బ్రాండ్ల మద్యం కల్తీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మందుబాబులు ఎక్కువగా వాడే ప్రముఖ బ్రాండ్లను టార్గెట్ చేయడంతో తేడా తెలియకుండా మద్యం విక్రయం జరిగింది. కేవలం కొన్ని సీసాలే కాదు.. ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలతో సహా అన్నీ సరిగా రూపొందించి మార్కెట్లోకి పంపేందుకు సిద్ధంగా ఉంచారు.
రెండు కోట్ల విలువైన స్పిరిట్, 11 వేల ఖాళీ బాటిళ్లు స్వాధీనం
పోలీసుల దాడుల్లో దాదాపు రూ. 15 లక్షల విలువైన కల్తీ మద్యం స్వాధీనం చేశారు. అదికాక, తయారీకి ఉపయోగించే రూ. 2 కోట్ల విలువైన స్పిరిట్ కూడా పట్టుబడింది. అలాగే 11,000 ఖాళీ సీసాలు, 20 బండిల్స్ లేబుళ్లు, నకిలీ సీలు, బాటిల్ కాప్స్ వంటివన్నీ పోలీసులకు చిక్కాయి.
హైదరాబాద్ స్పిరిట్ కంపెనీ నుంచి సరఫరా
ఈ ముఠా హైదరాబాద్‌లోని కృష్ణపద్మ అనే స్పిరిట్ కంపెనీ నుంచి భారీగా స్పిరిట్ కొనుగోలు చేశారు. అనంతరం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ రైస్ మిల్లులోకి తరలించి, అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ మద్యం గతంలో ఏపీ రాష్ట్రంలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం లాంటి చోట్ల విక్రయించిన రికార్డులు కూడా బయటపడ్డాయి.
ముఠాలో స్థానికులు కూడా..
ఈ ముఠాలో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన శంకర్ అనే వ్యక్తితో పాటు మరికొందరు స్థానికులు కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు వెల్లడించారు. కచ్చితమైన సమాచారం మేరకు దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నవారికోసం గాలింపు కొనసాగుతోంది.