పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ దాడులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
యుద్ధాన్ని తామే ఆపామన్న అమెరికా
భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర స్థాయికి చేరుకున్న ఉద్రిక్తతలు ఆ తర్వాత చల్లబడ్డాయి. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇదంతా తమ క్రెడిట్ అని చెప్పుకొచ్చారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తాము తగ్గించాం అని ట్రంప్ పలుసార్లు చెప్పుకొచ్చారు. కాల్పుల విరమణకు అంగీకరించకపోతే సుంకాలు విధిస్తామని అందుకు భారత్ అంగీకరించింది అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై మోదీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశాయి.

అమెరికా మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోదు: మోదీ
ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోదని ఆయన స్పష్టంగా తెలిపారు. అమెరికా అధ్యక్షుడికి కూడా ఇదే విషయం వివరించినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.

జీ7 సదస్సులో భేటీ కుదరకపోయినప్పటికీ… ఫోన్ సంభాషనతో చర్చ
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ-ట్రంప్ భేటీ జరగాల్సి ఉండగా, ట్రంప్ హఠాత్తుగా అమెరికాకు బయలుదేరడంతో సమావేశం జరగలేదు. అయితే ఇద్దరూ ఫోన్‌లో 35 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఇందులో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మోదీ అభ్యర్థన మేరకు ట్రంప్ ఉగ్రవాదంపై భారత్ ప్రయత్నాలకు మద్దతు తెలిపారు. ఇది పహల్గాం దాడి తర్వాత జరిగిన తొలి సంప్రదింపుగా అధికారులు పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ వివరాలపై ట్రంప్‌కు మోదీ వివరణ
విదేశాంగశాఖ కార్యదర్శి మిస్రీ ప్రకారం, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి మోదీ పూర్తి వివరాలు ఇచ్చారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సిందూర్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. కానీ, ఈ సమయంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు గానీ, మిలిటరీ ఒప్పందాలు గానీ ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఇదే సమయంలో భారత్ ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఏపుడు అంగీకరించదనే విషయాన్ని మోదీ స్పష్టంగా ట్రంప్‌కు తెలియజేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికే కాదు, భారత రాజకీయ వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశమని తెలిపారు.
మోదీకి అమెరికా ఆహ్వానం
ఇదిలా ఉంటే.. కెనడా నుంచి తిరిగివెళ్తుండగా, ట్రంప్ మోదీని అమెరికా రావాలని ఆహ్వానించినట్లు మిస్రీ తెలిపారు. కానీ, ఇప్పటికే ఉన్న షెడ్యూల్ కారణంగా మోదీ ఆ పర్యటనకు ఈసారి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. అయినప్పటికీ, ఇరు దేశాధినేతలు భవిష్యత్తులో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే దిశగా ఈ భేటీని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లుమిస్రీ వ్యాఖ్యానించారు.

క్వాడ్ సమావేశానికి ట్రంప్‌ను ఆహ్వానించిన మోదీ
తర్వాతి క్వాడ్ సమావేశం భారత్‌లో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ట్రంప్‌ను హాజరవ్వాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ట్రంప్ స్వీకరించడంతో పాటు, భారత్‌లో పర్యటించాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు మిస్రీ వెల్లడించారు. తద్వారా అమెరికా అధ్యక్షుడి పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ట్రంప్ పర్యటనతో అణు, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో చర్చలకు అవకాశాలు ఉంటాయని అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి.
