Credit card: మారనున్న క్రెడిట్ కార్డ్ మినిమం అమౌంట్ డ్యూ నిబంధనలు.. జూలై 15 నుంచే
ప్రస్తుతం క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ సమయంలో మనలో చాలా మంది మినిమం పేమెంట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఎస్బీఐ ఈ విషయంలో కీలక మార్పులు చేసింది.

SBI క్రెడిట్ కార్డుల కొత్త నిబంధనలేంటి?
2025 జూలై 15 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Cards) మినిమం అమౌంట్ డ్యూ (MAD) లెక్కించే విధానాన్ని మారుస్తోంది. క్రెడిట్ కార్డులో వాడిన మొత్తంలో ప్రతీ నెలా తప్పనిసరిగా చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని మిమినం అమౌంట్ డ్యూగా చెబుతుంటారు.
కొత్త విధానం ప్రకారం, MAD కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా. తరచూ మినిమం అమౌంట్ చెల్లించే వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మినిమం అమౌంట్ డ్యూ అంటే ఏంటి.?
క్రెడిట్ కార్డు వాడుతున్నప్పుడు, మీరు మొత్తం బకాయిని పూర్తిగా చెల్లించలేకపోతే కనీసం చెల్లించే విధానం అందుబాటులో ఉంటుంది. దీనినే మినిమం అమౌంట్ డ్యూ అంటారు. ఈ విధానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా లేట్ పేమెంట్ ఛార్జెస్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ మిగిలిన బకాయిపై వడ్డీ కొనసాగుతుంది.
కొత్త MAD ఫార్ములా ఎలా ఉంటుంది?
జూలై 15, 2025 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఫార్ములా ప్రకారం MAD ఇలా లెక్కిస్తారు: 100% జీఎస్టీ, 100% EMI అమౌంట్ (ఉంటే), 100% ఫీజులు / ఇతర చార్జీలు, 100% ఫైనాన్స్ చార్జీలు (వడ్డీ). ఓవర్లిమిట్ ఉన్నట్లయితే ఆ మొత్తం మిగిలిన రిటైల్ బకాయి మీద 2% ఉంటుంది. ఉదాహరణకు ఒక యూజర్ క్రెడిట్ కార్డు బకాయి రూ. 1,34,999.60గా ఉందని అనుకుంటే. అతనికి ఫైనాన్స్ చార్జీలు రూ. 11,972.18, ఫీజులు రూ. 2,700, జీఎస్టీ రూ. 2,640.99గా ఉంది.
అయితే కొత్త మినిమం అమౌంట్ డ్యూ (MAD) విధానంలో జీఎస్టీ రూ. 2,640.99, ఫీజులు రూ.2,700, ఫైనాన్స్ చార్జీలు రూ. 11,972.18, రిటైల్ బకాయి మీద 2% అంటే రూ. 2,699.99 ఇలా అన్నీ కలిపితే మొత్తం MAD రూ. 20,013.16 అవుతుంది. అదే పాత విధానంలో అయితే రూ. 17,313.17 చెల్లిస్తే సరిపోతుంది. పాత విధానంతో పోల్చితే రూ. 2699 ఎక్కువగా ఉంటుంది.
రివాల్వింగ్ క్రెడిట్ అంటే ఏంటి.?
మీరు మొత్తం బకాయి చెల్లించకుండా, కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని తరువాత నెలకి వాయిదా వేస్తే దానిని రివాల్వింగ్ క్రెడిట్ అంటారు. దీనివల్ల నెలనెలా వడ్డీలు పెరుగుతాయి, అప్పు పెరుగుతూనే ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతుంది.
పేమెంట్ సెటిల్‌మెంట్ క్రమం కూడా మారింది
క్రెడిట్ కార్డు చెల్లించలేని సందర్భాల్లో అమలు చేసే పేమెంట్ సెటిల్‌మెంట్ క్రమాన్ని కూడా మార్చారు. ఇందులో భాగంగా జీఎస్టీ, EMI అమౌంట్, ఫీజులు, ఫైనాన్స్ చార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్ వంటి అంశాల్లో మార్పులు చేశారు. ఇలా చేయటం వల్ల, ముందుగా ఎక్కువ వడ్డీ వచ్చే అంశాలే క్లియర్ అవుతాయి. దీని వల్ల బకాయిపై వడ్డీ తగ్గుతుంది.
ఫైనన్స్ ఛార్జీలు అంటే ఏంటి.?
మీరు మొత్తం బకాయిని చెల్లించకపోతే, మిగిలిన మొత్తంపై రోజువారీ వడ్డీ వేస్తారు. ఇది సుమారుగా నెలకు 3% (సంవత్సరానికి 36–40%) ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ. 10 వేలు బకాయి ఉంటే నెలకు రూ. 300 వడ్డీ పడుతుంది. పాత విధానంలో ఈ వడ్డీ మొత్తాన్ని చెల్లించాల్సి అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు 100% చెల్లించాల్సిందే.
ఈ మార్పులు యూజర్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి.?
ఎస్‌బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల కారణంగా మినిమం అమౌంట్ డ్యూను ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ చార్జీలు, ఫీజులు లాంటి అంశాలను ప్రతి నెల క్లియర్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల వడ్డీ పెరుగకుండా, అప్పు త్వరగా తగ్గుతుంది. డిసిప్లిన్‌తో టైమ్‌కి పేమెంట్లు చేస్తే, క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది.