భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాకిస్థాన్ లో బుధవారం చేపట్టిన ఆపరేషన్ సింధూర గురించి ముందుగానే చెప్పారు. అయితే నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఇలా వారు ఇచ్చిన 6 హింట్స్ ఏంటో తెలుసా?
Operation Sindoor : యావత్ దేశం మంచినిద్రలో ఉండగా భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిమరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం. అయితే ఈ సైనిక చర్యకు సరిగ్గా 4 గంటల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంకేతం ఇచ్చారు. ఆయన హింట్ ఇచ్చిన 4 గంటల్లోనే భారత్ పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది కేవలం ప్రసంగం కాదు. ఇది సిగ్నల్ సిస్టమ్. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 6 బిగ్ హింట్స్ ఇచ్చారు. ఇవేంటో తెలుసుకుందాం...
సిగ్నల్ 1: మోడీ మాటలు ఆగడం
మే 6 అంటే మంగళవారం రాత్రి 8:54 గంటలకు... ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ వేదికపై ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతుండగా ఏదో చెప్పబోయి కొద్దిసేపు ఆగిపోయారు. ఇలా ఎప్పుడూ తడబాటులేకుండా, విరామం లేకుండా మాట్లాడే మోదీ మొదటిసారి మాటలను ఆపుకున్నారు. తర్వాత మాట మార్చారు. అయితే ఇలా మోదీ మాటలు ఆగిపోవడం చాలా మందికి వింతగా అనిపించింది. ఏదో చెప్పాలనుకుని ఆపేసినట్టు అనిపించింది. 4 గంటల తర్వాత భారత్ వైమానిక దాడి చేసింది. అంటే ప్రధాని ఇదే చెప్పబోయి ఆగిపోయారా అన్న అనుమానం కలుగుతోంది.
సిగ్నల్ 2: 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్
ఇటీవల హోంమంత్రిత్వ శాఖ మే 7న దేశంలోని 244 ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. పంజాబ్‌తో పాటు కొన్నిచోట్ల ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇంత పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ 1971 తర్వాత మళ్లీ ఇప్పుడే నిర్వహిస్తున్నారు. అప్పుడు భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా ఇలా మాక్ డ్రిల్ పేరిట పాక్ ను తప్పుదారి పట్టించి వైమానిక దాడులు చేపట్టారు.
సిగ్నల్ 3: అమిత్ షా ప్రకటన
మే 1న ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా "పహల్గాం ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తీర్చుకుంటాం. వెతికి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఖరాఖండిగా చెప్పారు. ఇది సాధారణ రాజకీయ ప్రకటన కాదు. భారత్ ఒక చోట కాదు, బహుళ లక్ష్యాలపై ప్రతీకార చర్యలు తీసుకుంటుందనేది ఆయన చెప్పకనే చెప్పారు. అన్నట్లుగానే.ఒకే రాత్రి 9 స్థావరాలపై దాడులు జరిగాయి.
సిగ్నల్ 4: రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
మే 4న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ "ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది" అని అన్నారు. ఇది సర్జికల్ స్ట్రైక్ (2016) మరియు బాలాకోట్ వైమానిక దాడి (2019) సమయంలో చూపించిన నమ్మకాన్ని నేరుగా సూచిస్తుంది. ఈసారి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని, బాలాకోట్ కంటే పెద్దది కావచ్చని ఆయన మాటల్లో అంతరార్థం.
సిగ్నల్ 5: 10 రోజుల్లో 3 సార్లు వైమానిక దళాధిపతితో ప్రధాని భేటీ
10 రోజుల్లో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మూడుసార్లు ప్రధాని మోడీని కలిశారు. వారి మొదటి సమావేశం ఏప్రిల్ 26న జరిగింది. ఆ తర్వాత మే 3న రెండోసారి, మే 5న మూడోసారి కలిశారు. అంతకుముందు ఏప్రిల్ 26న సైనికాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులతో జరిగిన సమావేశంలో ప్రధాని సైన్యానికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చర్య తీసుకోవాలో వారే నిర్ణయించుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇంత తరచుగా ఉన్నతాధికారుల సమావేశాలు, ముఖ్యంగా వైమానిక దళాధిపతితో సమావేశాలు వైమానిక దాడికి సన్నాహాలు పూర్తయ్యాయని స్పష్టంగా సూచించాయి.
సిగ్నల్ 6: దృష్టి మళ్లించే వ్యూహం- నీరు, సముద్రం
ఏప్రిల్ 23న భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది, మే 4న పాకిస్తాన్ వైపు ప్రవహించే నీటిని ఆపడానికి చినాబ్‌పై ఉన్న రెండు ఆనకట్టలను మూసివేసింది. దీంతో భారత్ ప్రతీకారం వాటర్ స్ట్రైక్ అవుతుందని అనిపించింది. నౌకాదళం మే 2న సముద్ర విన్యాసాలు ప్రారంభించింది, మే 3న 'ట్రైడెంట్ ఆఫ్ నేవల్ పవర్' పేరుతో ఉపరితల నౌకలు, జలాంతర్గాములు, హెలికాప్టర్‌లను చూపించే పోస్ట్ షేర్ చేసింది. టర్కీ కూడా మే 4న తన యుద్ధనౌక కరాచీని పంపింది. భారత్ అదే రోజు వాణిజ్య నౌకలకు నావిగేషన్ హెచ్చరిక జారీ చేసింది, ఇవన్నీ శత్రువుకు భారత్ సముద్రం నుండి దాడి చేస్తుందని అనిపించేలా ఉద్దేశపూర్వకంగా చేశారు, కానీ అసలు ప్రతీకారం వైమానిక దాడి రూపంలో ఆకాశం నుండి వచ్చింది.


