బాయ్ ఫ్రెండ్ పై రేప్ కేసు పెట్టాలని ఓ యువతిపై తల్లిదండ్రులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిరోజాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి.. అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ఇష్టపడింది. వీరిద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు.

కాగా.. ఆ యువకుడిపై రేప్ కేసు పెట్టాలంటూ.. సదరు యువతిపై కన్న తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకువచ్చారు. దానికి ఆ యువతి అంగీకరించకపోవడంతో.. వాళ్లే స్వయంగా అతనిపై రేప్ కేసు పెట్టారు. ఈ కేసు ఇటీవల కోర్టులో హియరింగ్ కి వచ్చింది. కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు యువతి ఒప్పుకోలేదని.. తల్లిదండ్రులు ఆమెకు దారుణ శిక్ష విధించారు.

రాడ్డుని  నిప్పుల్లో కాల్చి.. దానితో యువతికి వాతలు పెట్టారు. అయినప్పటికీ.. యువతి సాక్ష్యం చెప్పడానికి అంగీకరించలేదు. దీంతో చంపేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. తల్లిదండ్రులు హింసిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.