Asianet News TeluguAsianet News Telugu

ఆ ఎన్నికల్లో పాకిస్తానీలు పోటీ చేశారు.. నేడు రీపోలింగ్ .. పాకిస్తానీలు ఇక్కడెలా పోటీ చేశారు? షాకింగ్ వివరాలివే

2020 డిసెంబర్‌లో జమ్ము కశ్మీర జిల్లా అభివృద్ధి మండలిలకు నిర్వహించిన ఎన్నికల్లో ఇద్దరు పాకిస్తాన్ పౌరులు పోటీ చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేసి తేల్చిన తర్వాత ఆ ఎన్నికను అధికారులు రద్దు చేశారు. ఈ రెండు స్థానాలకు నేడు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులు మన దేశ ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలిగారనే విషయం ఆసక్తికరంగా మారింది. దీనికితోడు ఈ రెండేళ్లలో గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు పార్టీ మారారు. కానీ, వారి ఎన్నికల గుర్తులు మారకపోవడంతో గందరగోళం నెలకొంది.
 

pakistan nationals contested in jammu kashmir local body polls, now repolling know how they contested
Author
First Published Dec 5, 2022, 1:04 PM IST

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను ఎత్తేసిన తర్వాత 2020లో అక్కడ తొలిసారి జిల్లా అభివృద్ధి మండలిల(డీడీసీ)కు ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పాకిస్తాన్ జాతీయులు పోటీ చేశారని తెలిసింది. దీంతో ఆ రెండు స్థానాలకు జరిగిన ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. ఈ రోజు మళ్లీ ఆ రెండు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రీపోలింగ్ నిర్వహిస్తున్నది. ఆ షాకింగ్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

2020 డిసెంబర్‌లో కుప్వారా జిల్లాలోని ద్రుగ్‌ముల్లా, బందిపొరా జిల్లాలోని హాజిన్‌లలో సీట్లు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. ఈ రెండు స్థానాల్లో పాకిస్తాన్ జాతీయులు పోటీ చేయగలిగారు. అయితే, ఫలితాల ప్రకటనకు కొన్ని గంటల ముందే ఇందుకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసిన సోమియా సదాఫ్, షాజియా బేగమ్‌లు పాకిస్తాన్ పౌరులని స్థానికులు ఆరోపించారు. దీంతో ఎన్నికల అధికారులు రిజల్ట్ ప్రకటిచంలేదు. దర్యాప్తు చేసి తేల్చిన తర్వాత ఆ రెండు స్థానాలకు జరిగిన ఎలక్షన్స్ రద్దు చేశారు.ఆ ఇద్దరు మహిళలకు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వాసులుగా గుర్తించారు. వారు జమ్ము కశ్మీర్‌లోకి ఎలా వచ్చారంటే..

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

ఉగ్రవాదులను పెళ్లాడి!:

ఉగ్రవాదానికి ఆకర్షితులై ట్రైనింగ్ కోసం కొందరు జమ్ము కశ్మీర్ యువకులు 1990లలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లారు. అక్కడ సాయుధ శిక్షణ పొందుతున్న కాలంలో అక్కడి యువతులనే పెళ్లి చేసుకున్నారు. కానీ, వారు ఉగ్రవాదులుగా మారవద్దని తమ ఆలోచనలను మార్చుకున్నారు. అదే సమయంలో భారత ప్రభుత్వం లొంగిపోయిన ఉగ్రవాదులకు రిహాబిలిటేషన్ పాలసీ ప్రకటించింది. దీంతో ఆ యువకులు తమ భార్యలను వెంటబెట్టుకుని పీవోకే నుంచి నేపాల్ మీదుగా కశ్మీర్ చేరుకున్నారు. కానీ, తీరా కశ్మీర్ చేరుకున్న తర్వాత ఆ మహిళలకు గుర్తింపు లేక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

నిబంధనల ప్రకారం, వారు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్టే. ఎల్‌వోసీలోని గుర్తించిన సరిహద్దు పాయింట్ల నుంచి వారు కశ్మీర్‌లోకి రావాలి. కానీ, వారు నేపాల్ మీదుగా వచ్చారు. ఈ విషయమై సెక్యూరిటీ ఏజెన్సీలు వారిని ప్రశ్నించగా.. పాకిస్తాన్ ఆర్మీ, దాని ఇతర ఏజెన్సీల కళ్లుగప్పి రావాలంటే నేపాల్ రూట్ మినహా తమకు మరే అవకాశం లేకుండా ఉండిందని వివరించారు. ఎల్‌వోసీ గుండా తాము సరెండర్ కావడానికి వస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో వారు అంగీకరించేవారు కాదని స్పష్టం చేశారు.

Also Read: Russia Ukraine Crisis: రష్యాకు ఉక్రెయిన్ అంటే ఎందుకు అంతటి ప్రాధాన్యత.. యుద్ధం చేసేంత అవసరం ఏమిటి?

రీపోలింగ్‌లోనూ తమాషా.. పార్టీ మారిన అభ్యర్థులు:

పాకిస్తాన్ పౌరులని గుర్తించిన అధికారులు పోటీలో నుంచి సోమియా సదాఫ్, షాజియా బేగమ్‌ల పేర్లను తొలగించారు. దీంతో ద్రుగ్‌ముల్లాలో పది మంది, సాజిన్ సీటులో ఐదుగురు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండేళ్ల కాలంలో పోటీలో నిలిచిన కొందరు అభ్యర్థులు పార్టీ మారారు. ద్రుగ్‌ముల్లా సీటులో మెహెబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి పోటీ చేసిన ఓ అభ్యర్థి ఇప్పుడు సాజద్ లోనెకు చెందిన పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు విశ్వసనీయంగా మారారు. కానీ, ఆమె పార్టీ గుర్తు మాత్రం మారలేదు.

అంటే.. ఆమె పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్.. ఎన్నికల గుర్తు మాత్రం పీడీపీకి చెందిన సిరాబుడ్డి, పెన్ను. అంటే.. సిరాబుడ్డి, పెన్ను గుర్తుకు ఓటు వేయవద్దని పీడీపీ ప్రచారం చేస్తే.. పీడీపీ గుర్తుకే ఓటేయాలని పీపుల్స్ కాన్ఫరెన్స్ క్యాంపెయిన్ చేయాల్సి వస్తున్నది. ఈ ఎన్నికల గుర్తును మార్చాలని ఎలక్షన్ కమిషన్‌కు మొరపెట్టుకుంటే నామినేషన్‌ల ఉపసంహరణ గడువు 2020 నవంబర 23నే ముగిసిందని, ఇప్పుడు అది సాధ్యం కాదని చెప్పారు. ఇది ఓటర్లనూ కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసింది.

Also Read: Russia Ukraine War: ఈ యుద్ధంతో ఎవరు లబ్ది పొందుతున్నారు? ఎలా లాభాలు ఆర్జిస్తున్నారు? యుద్ధం వెనుక కథ ఇదీ

పీడీపీ సింబల్‌కు ఓటేయాలని తమ మద్దతుదారులకు వివరించి చెప్పడం దుస్సాధ్యంగా మారిందని పీపుల్స్ కాన్ఫరెన్స్ ఓ సీనియర్ లీడర్ వివరించారు. ద్రుగ్‌ముల్లా, హాజిన్‌ ప్రజలు రెండేళ్లలో డీడీసీ ఎన్నికల్లో రెండు సార్లు ఓటేయడం గమనార్హం. 2020 డిసెంబర్‌లో వారు అభ్యర్థుల జాతీయతపై కన్ఫ్యూజన్ నెలకొనగా.. ఇప్పడు పార్టీ గుర్తుల విషయమై ఓటర్లు, పార్టీలు కూడా కన్ఫ్యూజన్‌ను ఎదుర్కొంటున్నాయి.

జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. 2019లో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios