Asianet News TeluguAsianet News Telugu

Russia Ukraine War: ఈ యుద్ధంతో ఎవరు లబ్ది పొందుతున్నారు? ఎలా లాభాలు ఆర్జిస్తున్నారు? యుద్ధం వెనుక కథ ఇదీ

గతనెల 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. నాటో కూటమిలో చేరవద్దనే తన డిమాండ్ నెరవేరకపోవడంతో అప్పటికే ఆయుధాలను పెద్దమొత్తంలో పోగు చేసుకున్న ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగింది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ యుద్ధం ఇరు దేశాలకూ నష్టాన్ని తెచ్చి పెడుతుంది. కానీ, కొన్ని దేశాలకు మాత్రం అపారమైన లాభాలను ఆర్జించి పెడుతున్నది.

Who profits the Russia Ukraine war.. and How they benefits
Author
hyderabad, First Published Mar 5, 2022, 6:02 PM IST

న్యూఢిల్లీ: యుద్ధం కొందరికి ప్రాణాలతో చెలగాటం అయితే.. కొందరికి అది ఊహించని లాభాలను ఆర్జించే వ్యాపారం(Arms Business). కొందరు యుద్ధాలు జరగడానికి కాచుక్కూచుంటారు. దాన్ని ఒక వ్యాపారంగానూ మార్చుకున్నారు. ఇంతకి రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఎవరికి లాభాలు ఆర్జించి పెడుతున్నది? యుద్ధం ఎప్పుడూ ఇరుపక్షాలను పాతాళానికి తొక్కితుంది. కానీ, ఇప్పుడు ఈ రెండు పక్షాలతో సంబంధం లేని ఇతర దేశాలు వాటితో లాభపడుతున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

2017 చివర్లో ఉక్రెయిన్(Ukraine) ఆయుధాలు(Arms) కొనుగోలు చేయడానికి, రూ. 47 మిలియన్ డాలర్ల ఆయుధాల ఎగుమతికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైసెన్స్ అప్రూవ్ చేశాడు. ఆ చర్య అప్పుడు చాలా మందిని ఆశ్చర్యపరించింది. ఈ నిర్ణయం కచ్చితంగా ఐరోపాలో అశాంతిని రగిలిస్తుందని ఊహించారు. ఉక్రెయిన్ ఆయుధాలు పోగు చేసుకోవడం.. కచ్చితంగా పుతిన్‌ను రెచ్చగొట్టడమే అవుతుందని, అసలు ఘర్షణలే లేని చోట.. యుద్ధానికి ఇది బీజం వేస్తుందని చర్చలు జరిగాయి. కానీ, అమెరికా ఆగలేదు. ట్రంప్ ఓడిపోయిన తర్వాత కూడా జో బైడెన్ అదే పాలసీని కొనసాగించారు. ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఉక్రెయిన్‌పై యుద్ధం(War) ప్రకటించగానే చాలా మంది భయాలు వాస్తవరూపం దాల్చాయి. ఇప్పుడు రష్యా నుంచి రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అవసరం. ఉక్రెయిన్‌కు అనేక నాటో దేశాల నుంచి ఆయుధాలు వస్తున్నా.. అందులో సింహ భాగం అమెరికా నుంచే ఉంటాయి. రష్యా దాడిని ప్రకటించిన రెండు రోజులకే జో బైడెన్ అందనంగా 350 మిలియన్ డాలర్ల ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలించడానికి ఓకే అన్నారు. ఉక్రెయిన్‌కు 1 బిలియన్ డాలర్ల ఆయుధాలు అమ్మడానికి గతేడాది కమిట్‌మెంట్ ఇచ్చి ఉన్నామని ఇటీవలే అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. భయంకర ఆయుధాలను ఉక్రెయిన్‌కు అమ్మడం అంటే.. మంటల్లో కిరోసన్ చల్లడం వంటిదేనని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్ అన్నారు.

ఇప్పుడు ఆయుధాలు నిరంతరాయంగా ఉక్రెయిన్‌కు తరలడమే కాదు.. గతంలో కంటే పెద్ద మొత్తంలో తరలుతున్నాయి. డిఫెన్స్ కాంట్రాక్టర్లకు, ఆయుధ తయారీ సంస్థలకు యుద్ధం ఎంతో లాభదాయకమైన మార్గం. ప్రపంచంలో అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్టర్, ఆయుధ ఎగుమతిదారు. రష్యా ద్వితీయ స్థానంలో ఉంటుంది. కానీ, అమెరికాలో మూడో వంతు మాత్రమే అది ఎగుమతి చేస్తుంది.

ఇక్కడ మరొక విషయం ఏమంటే.. పుతిన్‌కు గుణపాఠం చెప్పాలని భావించే వారంతా ఒకటి గమనించాలి. అమెరికా ఇప్పటికీ ఉక్రెయిన్‌కు కేవలం ఆయుధాలు అందించాలనే భావిస్తున్నది. కానీ, ఉక్రెయిన్ తరఫున బరిలోకి దిగి రష్యాను ఎదుర్కొంటామని చెప్పటం లేదు. రష్యా న్యూక్లియర్ బెదిరింపును ప్రస్తావించినా.. బైడెన్ తన వైఖరి మార్చుకోలేదు. తమ పాత్ర కేవలం ఉక్రెయిన్‌కు ఆయుధాలు చేరవేసే వరకు మాత్రమే అన్నట్టుగా వ్యవహరించారు. కేవలం అమెరికానే కాదు.. నాటో దేశాలూ ఇదే విధానాన్నిఅవలంభించాయి.

పుతిన్ కొన్ని నెలల ముందు నుంచే ఉక్రెయిన్‌పై దాడి చేయడం తథ్యం అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. జనవరి 26న అమెరికా మిత్రదేశం యూకే విదేశాంగ కార్యదర్శి ఈ విషయాన్ని చెప్పారు. ఉక్రెయిన్‌కు పెద్దమొత్తంలో బలగాలు తరలిరావడానికి రష్యాలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ, వారు చేసిందేమంటే.. 2000 మెయిన్ ట్యాంక్ నెక్స్ట్ జనరేషన్ లైట్ యాంటీ ట్యాంక్ వీపన్లను ఉక్రెయిన్‌కు పంపింది. వీటిని బ్రిటన్ స్వీడిష్ కంపెనీ సాబ్ తయారు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో కేవలం అమెరికానే కాదు.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తరలిస్తున్న ఇటలీ, టర్కీ, జర్మనీ, ఇతర మరికొన్ని దేశాలు లబ్ది పొందుతున్నాయి.

రష్యా పక్కనే ఉండే మరో దేశం జార్జియా విషయంలోనూ గతంలో ఇలాగే జరిగింది. 2008లో జార్జియా, రష్యా యుద్ధానికి ముందు అప్పటి యూఎస్ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను జార్జియాకు తరలించారు. దీనికి పుతిన్ అభ్యంతరం తెలిపారు. జార్జియాను బుష్ కన్విన్స్ చేయగలిగాడు. ఒక వేళ రష్యా ఆయుధాలతో దాడికి దిగితే.. జార్జియా తరఫున నాటో యుద్ధంలోకి దిగుతుందని చెప్పాడు. ఉక్రెయిన్ తరహాలోనే జార్జియా కూడా నాటో సభ్యదేశం కాదు. అమెరికా నుంచి ఆయుధాలు రాగానే.. ఉక్రెయిన్ తరహాలోనే జార్జియాలో ఉన్న వేర్పాటువాదుల ప్రాంతాలపై విరుచుకుపడింది. పుతిన్ రంగంలోకి దిగాడు. జార్జియా, రష్యా యుద్ధం మొదలైంది. అప్పుడు కూడా అమెరికా తన పాత్రను కేవలం జార్జియాకు ఆయుధాలు తరలింపునకు పరిమితం చేసుకుంది. రష్యాతో దాడికి దిగలేదు. చరిత్రలోనూ మనకు మరికొన్ని ఉదంతాలు కనిపిస్తాయి. యుద్ధానికి దిగుతున్న రెండు పక్షాలకు ఈ అభివృద్ధి చెందిన దేశాలే ఆయుధాలు సరఫరా చేస్తాయి. ఒక్కోసారి వాటికి ఆయుధాలు అమ్మి వాటిపై యుద్ధాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి.

అలాగే, యుద్ధం తర్వాతి ఏ దేశమైనా తీవ్రంగా నష్టపోతుంది. అనేక మౌలిక సదుపాయాలు భూస్థాపితం అవుతాయి. ఇలాంటి వాటిని పునర్నిర్మించే పనికి తక్కువ వడ్డీతో లోన్లు పొందుతాయి. ఆ మొత్తాన్ని మళ్లీ ఈ అభివృద్ధి చెందిన దేశాలే రీకన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టుల కింద ఎగరేసుకుపోతాయి. ఆ దేశాల కంపెనీలే ఈ పని చేపడతాయి. తద్వారా రుణదాతలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చే రుణాలను తిరిగి ఆ దేశాల కంపెనీలకే ఈ ప్రాజెక్టుల కింద ముట్టజెప్పుతాయి. అఫ్ఘనిస్తాన్ ఇందుకు ఉదాహరణ. స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ రికన్‌స్ట్రక్షన్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో రీకన్‌స్ట్రక్షన్ కోసం 20 ఏళ్ల కాలానికి 145 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును అమెరికా తీసుకుంది. ఇందులో సింహభాగం అమెరికా కంపెనీలకే మళ్లుతున్నది.

మరొక విషయం, ఈ యుద్ధంతో అమెరికాకు చిరకాల వైరిగా ఉన్న రష్యా ఎంతో కొంత బలహీనపడుతుంది. తూర్పు ఐరోపాపైనా దాని పట్టు పెంచుకునే అవకాశం చిక్కుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios