Mumbai Attacks: 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన దాడి దేశాన్ని కుదిపేసింది. దాదాపు 48 గంటల పాటు నగరం గందరగోళంలో మునిగిపోయింది. 17 ఏళ్లు గడిచినా ఆ దాడి వెనుక ఉన్న కొన్ని రహస్యాలు ఇంకా బయటకు రాలేదు. 

స్థానికంగా ఎవరు సహకరించారు?

స్థానికంగా ఉగ్ర‌వాదుల‌కు స‌హ‌క‌రించిన వ్య‌క్తి పేరు సాజిద్ మిర్‌.. అతని ఉనికిపై ఇప్పటికీ క్లారిటీ లేదు ఎందుకంటే పాకిస్తాన్ అతని ఉనికిని ఇప్పటికీ నిరాకరిస్తోంది. దాడికి ముందు మిర్ క్రికెట్ అభిమానిగా ఇండియాకు వచ్చాడు. ఆ ప్రయాణంలోనే దాడి చేయాల్సిన చోట్లను ఎంపిక చేశాడు.

టార్గెట్ ఎంచుకున్న విధానం

తాజ్ మహల్ హోటల్, ఓబెరాయ్, ట్రైడెంట్, CST స్టేషన్ వంటి ప్రముఖ ప్రదేశాలతో పాటు ఉగ్రవాదులు నరిమాన్ హౌస్‌ (ప్రస్తుతం ఛబాద్ హౌస్‌) ను కూడా టార్గెట్ చేశారు. ఈ ప్రాంతం అప్పట్లో పెద్దగా ఎవరికి తెలియదు. ఇలాంటి ప్రదేశాన్ని ఎవరైనా లోకల్ వ్యక్తి లేదా ముంబై గురించి బాగా తెలిసినవాడు మాత్రమే ఎంపిక చేయగలడు. అని ద‌ర్యాప్తు అధికారులు భావించారు.

ఇక్కడే దావూద్ ఇబ్రాహీం పేరు బయటకు వచ్చింది. గూఢచార సంస్థల సమాచారం ప్రకారం, సాజిద్ మిర్ దావూద్ ఇబ్రాహీం, అతని గ్యాంగ్‌తో మాట్లాడి లక్ష్యాలను నిర్ణయించాడు. 1993 బాంబు పేలుళ్లలో కూడా దావూద్, టైగర్ మేమన్ లక్ష్యాల ఎంపికలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందుకే 26/11 దాడికి కూడా అతనే సూచనలు ఇచ్చినట్లు అనుమానం.

ఇందుకు తర్వాత మిర్ భారతదేశానికి వచ్చి మొత్తం ప్రదేశాలను పరిశీలించాడు. అనంత‌రం ఆ సమాచారం డేవిడ్ హెడ్‌లీకు అందించాడు. హెడ్‌లీ ఆ టార్గెట్లపై విపులమైన మ్యాప్‌లు, రికార్డింగ్లు చేశాడు.

పాకిస్తాన్ ఇంకా దాచిపెడుతున్న నిజాలు

భారతదేశం, అమెరికా ఎన్నిసార్లు కోరినప్పటికీ, పాకిస్తాన్ సాజిద్ మిర్ ఉనికిని ఒప్పుకోలేదు. ఓసారి అతడిని పాకిస్తాన్‌లో ఒక మౌలవీ అని కూడా చెప్పింది. కాని దర్యాప్తులో లభించిన ఆధారాలు మాత్రం కొన్ని విష‌యాల‌ను స్ప‌ష్టం చేస్తున్నాయి. మిర్ ముందు పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నాడు, తర్వాత ISIలో చేరాడు, 26/11 దాడి కోసం ప్రత్యేకంగా అతడిని నియమించారు. అతడే దాడి మొత్తం పథకం రూపొందించి, రిక్రూట్‌మెంట్ నుంచి ట్రైనింగ్ వరకు చూసుకున్నాడు. ట్రైనింగ్ కోసం అతడు మేజర్ ఇక్బాల్, మేజర్ సమీర్ అలీ అనే ఇద్దరు ISI అధికారులను కూడా నియమించాడు.

26/11 కేసులో మరో ముఖ్య నిందితుడు తహవ్వుర్ రానా. అతడి విచారణ ఇంకా కొనసాగుతోంది. NIA దృష్టిలో రానా ఒక కీలక లింక్. ఎందుకంటే: అతడు పాకిస్తాన్ ఆర్మీకి చెందినవాడు, హెడ్‌లీతో నేరుగా కలిసి పనిచేశాడు. మిర్ పాత్రపై పూర్తి వివరాలు చెప్పగలడు. అతడు నిజాలు బ‌య‌ట‌పెడితే.. ఈ కుట్రలో పాకిస్తాన్ ప్రభుత్వ అసలైన పాత్ర బయటపడే అవకాశం ఉంది.