వ్యభిచారం చేస్తోందని ఆరోపిస్తూ.. ఓ కోడలికి అత్త అగ్నిపరీక్ష పెట్టింది.  నిజాయితినీ నిరూపించుకోమంటూ.. చేతులను నిప్పులతో కాల్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురకి చెందిన సుమని అనే యువతికి గతేడాది ఏప్రిల్ లో అదే ప్రాంతానికి చెందిన జైవీర్ తో వివాహమైంది.  కాగా.. అదే రోజు సుమని చెల్లికి..జైవీర్ సోదరుడు యష్ వీర్ కూడా వివాహమైంది.

పెళ్లి జరిగిన ఆరునెలలపాటు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత నుంచే సుమనికి అత్తారింట్లో కష్టాలు మొదలయ్యాయి. ఏదో ఒక వంక చూపించి సాధించడం మొదలుపెట్టారు. కట్నం తేవాలంటూ వేధించేవారు. ఆఖరికి వ్యభిచారం చేస్తున్నావంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. కట్టుకున్న భర్త కూడా తనను మోసం చేస్తున్నావంటూ హింసించడం మొదలుపెట్టాడు.

తాను ఎలాంటి తప్పుచేయలేదని వేడుకున్నా వారు అంగీకరించలేదు. కాగా.. ఇటీవల వ్యభిచారం చేయడం లేదని నిరూపించుకోవడానికి అగ్నిపరీక్ష పెట్టారు. ఆమె చేతులను నిప్పుల్లో పెట్టి.. ఏ తప్పుచేయకపోతే.. చేతులు కాలవని తేల్చారు. కాగా.. ఆమె చేతులు కాలడంతో తప్పు చేశావంటూ మళ్లీ ఆరోపించడం మొదలుపెట్టారు. దీంతో.. బాధితురాలు తన తండ్రి సహాయంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.