Manipur Gangrape: గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడి ఫొటో ఇదే.. అరెస్టు చేసిన పోలీసులు
మణిపూర్‌లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వీడియో ఓ యువతిని పట్టుకుని కనిపించిన ప్రధాన నిందితుడు హురేం హెరోదాస్ మైతేయిని పోలీసులు తౌబాల్ జిల్లాలో అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, ఓ యువతిపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడటానికి సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మే 4వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ప్రధాన నిందితుడూ కనిపించాడు. ఈ కేసులో మణిపూర్ పోలీసులు తొలి అరెస్టు జరిపారు. ప్రధాన నిందితుడైన హురేం హెరోదాస్ మైతేయి (32)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగ్నంగా ఊరేగిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరిని హురేం హెరోదాస్‌ను పట్టుకుని ఆ వైరల్ వీడియోలో కనిపించాడు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటుగా తీసుకుని రంగంలోకి దూకారు. తౌబల్ జిల్లాలో ప్రధాన నిందితుడు హురేం హెరోదాస్‌ను అరెస్టు చేశారు. హురేం హెరోదాస్ మైతేయి పెంచి అవాంగ్ లెకాయ్ నివాసి.
ఆ దారుణంలో పాలుపంచుకున్న దుండగులను ఈ రోజు రాత్రి (20వ తేదీ) లోపు పట్టుకుని తీరుతామని మణిపూర్ పోలీసులు వెల్లడించారు.
Also Read: Manipur: పోలీసులు ఆ దాష్టీకాన్ని చేష్టలుడిగి చూశారు: వైరల్ వీడియోలోని బాధిత మహిళల తీవ్ర ఆరోపణలు
సీఎం ఎన్ బీరెన్ సింగ్ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు బాధిత మహిళలకు సానుభూతి ప్రకటించారు. మన సమాజంలో ఇంతటి దారుణానికి చోటు లేదని స్పష్టం చేశారు. ఈ దాష్టీకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉరి శిక్షపడే అవకాశాలనూ చూస్తామని తెలిపారు.
మే నెల నుంచి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణలు మొదలైన రోజుల్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది. మే 3 నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అధునాతన ఆయుధాలతో సుమారు 800 నుంచి 1000 మంది మైతేయి కమ్యూనిటీకి చెందిన ఓ మూక కాంగ్‌పోక్పికి చెందిన ఓ గ్రామంలోకి దూసుకెళ్లారు. అక్కడే కనిపించిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకుని దాడికి దిగారు. ఓ మహిళపై లైంగిక వేధింపులు జరుపుతుండగా.. అడ్డు వచ్చిన సోదరుడిని కొట్టి చంపేశారు.