Asianet News TeluguAsianet News Telugu

Manipur: పోలీసులు ఆ దాష్టీకాన్ని చేష్టలుడిగి చూశారు: వైరల్ వీడియోలోని బాధిత మహిళల తీవ్ర ఆరోపణలు

మణిపూర్‌లో మే 4వ తేదీన మహిళను నగ్నంగా ఊరేగించి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా, ఆ వీడియోలోని బాధిత మహిళలు మణిపూర్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
 

manipur women survivors who were in horrific video says police did not help them kms
Author
First Published Jul 20, 2023, 3:43 PM IST

న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన ఓ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎందరో మనసులను కలచివేసింది. ఆ వీడియో దేశ ఆత్మను కుదిపింది. మనసు వికలం చేసింది. మే నెలలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న ఈ అల్లర్లపై ప్రధాని మోడీ ఇవాళ్టి వరకు మాట్లాడలేదు. ఈ వీడియో చర్చనీయాంశమైన తరుణంలో ప్రధాని మోడీ స్పందించారు. ఈ రోజే ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో ఈ ఘటన పై రచ్చ జరిగింది. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభలూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కుకీ, మైతేయి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉద్రిక్తతలను కట్టడి చేయడంలో విజయవంతం కాలేకపోయాయి. మే 4వ తేదీన కాంగ్‌పోక్పిలో ఆ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కుకీ తెగకు చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఒక మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే.. ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు మహిళలు ది వైర్ అనే న్యూస్ పోర్టల్‌తో మాట్లాడారు. అప్పటి దాష్టీకాన్ని గుర్తు చేస్తూ మణిపూర్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ దారుణం జరుగుతుండగా అక్కడ మణిపూర్ పోలీసులు ఉన్నారని బాధితురాలు చెప్పింది. కానీ, వారు తమకు సహాయం చేయలేదని ఆరోపించింది. రెండో బాధితురాలు మాట్లాడుతూ.. పోలీసులు కారులో కూర్చుని జరుగుతున్న హింసను చేష్టలుడిగి చూశారని చెప్పింది. వారు తమకు ఏ విధంగానూ సహాయం చేయలేదని తెలిపింది. ఈ ఆరోపణలపై పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉన్నది.

Also Read: మణిపూర్ ఘటనపై చర్చించాల్సిందే : విపక్షాల పట్టు.. లోక్‌సభలో గందరగోళం, సభ రేపటికి వాయిదా

కాంగ్‌పోక్పిలోని బీ ఫైనోమ్ గ్రామానికి మైతేయీ మూకలు వస్తున్నట్టు పొరుగునే ఉన్న మైతేయి కమ్యూనిటీ వారు కొందరు తమకు చెప్పారని మొదటి బాధితురాలు తెలిపింది. దీంతో ఊరివిడిచి పారిపోవాలని గ్రామంలోని కుకీలకు అర్థమైపోయిందని వివరించింది. అందరూ వెళ్లారనీ, కానీ, తమ రెండు కుటుంబాలు మాత్రమే వెళ్లలేకపోయాయని పేర్కొంది. ఊరిలోకి వచ్చిన మూక అక్కడే ఉండిపోయిన తమపై దాడికి దిగిందని వివరించింది.

తాను ఇతర బాధితుల గురించి ఆలోచిస్తున్నానని, కానీ, దాడి చేసిన దుండగులు మాత్రం ఏమీ ఆలోచించడం లేదని ఆమె తెలిపింది. తమ ఇద్దరిని చెట్లు పొదలు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లారని వివరించింది. ముగ్గురు తమను పట్టుకుని ఉండగా ఒకడు బయటికి వెళ్లి ఎవరైనా తమను వేధించాలని భావిస్తే వచ్చి చేసుకోవచ్చని మిగితా వారికి పిలుపు ఇచ్చాడని చెప్పింది.

Also Read: మహిళల నగ్న ఊరేగింపును సుమోటోగా తీసుకున్న సుప్రీం: చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశం

తమకు కొంత మంది మైతేయి తెగ వారు సహాయం చేశారని మొదటి బాధితురాలు తెలిపింది. కొందరు తమను వెంటనే బట్టలు విడిచేయాలని ఆదేశించారని, అందులో కొందరు తమను కాపాడాలని అనుకున్నారని వివరించింది.

జులై 19న మణిపూర్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఓ ట్వీట్ చేసింది. అపహరణ, గ్యాంగ్ రేప్, హత్యా నేరాల కింద గుర్తు తెలియని దుండగుల పై కేసు నమోదైందని, వారిని అరెస్టు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది. కానీ, ఇప్పటికీ ఒక్కరూ ఈ కేసులో అరెస్టు కాలేదు.

మే 3వ తేదీ నుంచి హింసాత్మక ఘర్షణల కారణంగా ఇక్కడ ఇంటర్నెట్ పై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే.

గత రెండు నెలల నుంచి కుకీ కమ్యూనిటీ పోలీసులపై తీవ్ర ఆరోపనలు చేస్తున్న విషయం విదితమే. వారు మైతేయి కమ్యూనిటీకి ఫేవర్‌గా ఉంటున్నారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios