Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కంటతడి పెట్టుకున్నారు.
BRS MLA Maganti Gopinath: జూబ్లీహిల్స్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. హృదయ సంబంధిత తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ఉదయం మరణించారు.
మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
మాగంటి మరణంతో కంటతడి పెట్టుకున్న కేసీఆర్
మాగంటి గోపీనాథ్ మరణాన్ని "భారత రాష్ట్ర సమితికి పూడ్చలేని లోటు"గా కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయ రంగంలో పటిష్టంగా ఎదుగుతూ, ప్రజలకు వినయపూర్వక సేవలు అందించిన గోపీనాథ్‌ను "శాంతియుత ప్రజా నాయకుడని" కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ క్రమంలోనే కేసీఆర్ మాగంటి గోపీనాథ్ కు నివాళులు అర్పిస్తూ కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మాట్లాడుతూ, మాగంటి గోపీనాథ్ మరణ వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మూడు టర్ములు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఎంతో కృషి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇది పార్టీకి పెద్ద లోటుగా ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు కూడా తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకుముందు, మాగంటి గోపీనాథ్‌కు నివాళులర్పించేందుకు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి హైదరాబాదులోని AIG హాస్పిటల్‌ను సందర్శించారు. అక్కడ కుటుంబ సభ్యులను కలుసుకుని సంతాపం తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్ లు మాగంటి గోపీనాథ్ అంతిమాత్రలో ఆయన పాడే మోశారు.
మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం
మాగంటి గోపీనాథ్ తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు. 1980వ దశకంలో ఆ పార్టీ స్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1985 నుంచి 1992 వరకు టీడీపీ యువజన విభాగమైన తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలో యువ నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఆ తరువాత బహుళ మార్పుల తర్వాత మాగంటి గోపీనాథ్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు మళ్లీ గెలిచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు.
మాగంటి గోపీనాథ్ కు సినీరంగంతో అనుబంధం
రాజకీయ రంగంతో పాటు మాగంటి గోపీనాథ్ సినిమారంగంతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు, నిర్మాతలు ఆయనతో స్నేహితులుగా ఉన్నారు. నిర్మాతగా పలు సినిమాలు కూడా తెరకెక్కించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.