Asianet News TeluguAsianet News Telugu

సీఏఏ అమలుకు అనుమతివ్వబోమన్న మమతా బెనర్జీ.. బదులిచ్చిన హోం శాఖ సహాయ మంత్రి.. ఏమన్నారంటే ?

సీఏఏ అమలుకు అనుమతి ఇవ్వబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ధీటుగా బదిలిచ్చారు. సీఏఏ దేశ వ్యాప్తంగా అమలు అవుతుందని స్పష్టం చేశారు. 

Mamata Banerjee who will not allow the implementation of CAA.. Minister of State for Home Affairs replied.
Author
First Published Nov 3, 2022, 3:41 AM IST

సీఏఏను అమలు చేసేందుకు బీజేపీకి అనుమతి ఇవ్వబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తుతోందని, పౌరసత్వ సవరణ చట్టం అమలుకు అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె కేంద్రంపై బుధవారం విరుచుకుపడ్డారు. కాగా ఆమె ప్రకటనపై చేసిన కొన్ని గంటల తరువాత దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రామాణిక్ స్పందించారు. సీఏఏను క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. 

తొలిసారిగా సీఆర్‌పీఎఫ్‌లో ఇద్దరు మహిళలకు ఐజీ ర్యాంక్.. ఆర్‌ఏఎఫ్, బీహార్ సెక్టార్ బాధ్యతల అప్పగింత

పౌరసత్వ సవరణ చట్టం- 2019 (సీఏఏ) ప్రకారం కాకుండా పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ప్రస్తుతం గుజరాత్ లోని రెండు జిల్లాల్లో నివసిస్తున్న పాకిస్థాన్ కు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం సోమవారం నిర్ణయించింది. దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. ‘ఈ రాజకీయాలన్నీ ఆపండి. గుజరాత్ లో ఎన్నికలు ఉన్నందున వారు (బిజెపి) ఈ పని చేస్తున్నారు. మేము దానిని (సీఏఏ) అమలు చేయడానికి వారిని (బీజేపీ) అనుమతించము. మాకు అందరూ దేశ పౌరులే. మేము దీనికి (సీఏఏ) వ్యతిరేకంగా ఉన్నాము’ అని ఆమె అన్నారు. ఎన్నికలు, రాజకీయాలు అంత ముఖ్యమైనవి కావని.. కానీ ప్రజల జీవితాలు చాలా ముఖ్యమని తాను చెబుతానని తెలిపారు. మమతా బెనర్జీ బుధవారం చెన్నైకి బయలుదేరే ముందు కోల్ కతా ఎయిర్ పోర్టులో మీడియాతో వ్యాఖ్యానించారు. ఆమె పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్ ఫ్యామీలీ ఫంక్షన్ లో పాల్గొనేందుకు తమిళనాడుకు వెళ్లారు. 

కాగా.. పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతంలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో విమానం దిగిన కేంద్ర మంత్రి ప్రామాణిక్ మమతా బెనర్జీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ‘‘సీఏఏ అణగారిన, అణచివేతకు గురైన హిందువులు, ఇతర ప్రజల కోసం. ఇది గుజరాత్‌లోనే కాకుండా క్రమంగా భారతదేశం అంతటా కూడా అమలవుతుంది.’’అని ఆయన చెప్పారు.

మసీదులో మత గ్రంథాల దహనం.. యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఉద్రిక్తత..

ఇదిలా ఉండగా.. దేశంలో సీఏఏ అమలు ప్రక్రియ ప్రారంభమైందని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు. దాని నుండి రాష్ట్రాన్ని మినహాయించలేమని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. అయితే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అషిమ్ సర్కార్ దీనికి భిన్నమైన రాగం పాడారు. 1955 చట్టం ప్రకారం పౌరసత్వం మంజూరు చేస్తే.. మళ్లీ  2019లో పౌరసత్వ చట్టం అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారరు. 

కాగా.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో హింసకు గురై డిసెంబర్ 31, 2014 వరకు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలుసవాదులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత జాతీయత ఇవ్వాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే సీఏఏను 2019 లో పార్లమెంటు ఆమోదించింది. కానీ దాని కింద ఇంకా నియామాలు రూపొందించకపోవడం వల్ల ఆ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. 

ఈ వివాదాస్పదమైన సీఏఏను అమలు చేస్తామని గత లోక్ సభ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తన ప్రధాన వాగ్దానంగా ప్రచారం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పుంజుకోవడానికి ఇది పనికొచ్చే అంశంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఆ రాష్ట్రంలో 2023లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios