రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అయోధ్య రామమందిర ట్రస్ట్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?
Ram Mandir: అయోధ్యలో రామ్ లల్లాప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించలేదన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం తోసిపుచ్చింది.
Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు. తాజాగా రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పిలవలేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖండించింది. రాహుల్ గాంధీ ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే కాకుండా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా ఆహ్వానించారు. ఏప్రిల్ 30న టైమ్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఎడిషన్‌లో రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ప్రచురితమైంది. ఈ ప్రకటనపై ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ అయోధ్య రామమందిర ట్రస్ట్ పై సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ముర్ముని ఆహ్వానించలేదనీ, ఆమె గిరిజన మహిళ అనే కారణంతో ఆహ్వానించలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఈ వాక్యాలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి,తప్పుదారి పట్టించేవని అన్నారు. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో నూతన రామ్ లాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారత రాష్ట్రపతి, గౌరవనీయులైన ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్‌లు ఇద్దరినీ ఆహ్వానించారని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ పేర్కొన్నారు.
ఈ విషయాన్ని మరోసారి రాహుల్ గాంధీకి గుర్తు చేయాలనుకుంటున్నాననీ, శ్రీరామజన్మభూమి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులు, సాధువులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారిని ఆహ్వానించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇతర మతాల వారు, మైనార్టీలు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఇదొక్కటే కాదు, ప్రాణ ప్రతిష్ట పూజ సమయంలో దేవాలయంలోని గుప్త మండపంలో పూజించే అవకాశం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అత్యంత వెనుకబడిన తరగతుల కుటుంబ సభ్యులకు కూడా లభించిందని గుర్తు చేశారు. మూడు నెలల క్రితం జరిగిన సంఘటనల వాస్తవాలను ధృవీకరించకుండా తప్పుడు, నిరాధారమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సరికాదని, సమాజంలో వివక్షను సృష్టిస్తాయని తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. వారణాసి నుంచి వచ్చిన అర్చకుల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రామమందిర మెగా ప్రారంభోత్సవానికి ప్రధానితో పాటు పెద్ద సంఖ్యలో వీవీఐపీలను కూడా ఆహ్వానించారు.