Asianet News TeluguAsianet News Telugu

కార్మిక నేత నుంచి కాంగ్రెస్ చీఫ్ వరకు.. నూతన అధ్యక్షుడు ఖర్గే ప్రస్థానం ఇదీ..!

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్మిక నేతగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడిగా రికార్డు సృష్టిస్తున్నారు. న్యాయవాదిగా అవతారమెత్తి లేబర్ యూనియన్ కేసులు వాదించి.. ఆ తర్వాత కార్మిక నేతగా మారారు. ఎన్నికల బరిలోనూ అజేయ నేతగా నిలిచారు. 
 

mallikarjun kharge political journey.. from labour union leader to congress president
Author
First Published Oct 19, 2022, 4:11 PM IST

న్యూఢిల్లీ: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతర నేత ఎన్నికయ్యారు. ఇంగ్లీష్‌పై మంచి పట్టున్న సీనియర్ నేత శశిథరూర్‌ను ఓడించి మాపన్న మల్లికార్జున్ ఖర్గే అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. గెలుపు తన చిరునామాగా పెట్టుకున్న మల్లికార్జున్ ఖర్గే గురించిన ఆసక్తికర విషయాలు చూద్దాం.

మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల్లో చాలా వరకు విజయం సాధిస్తారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ఆయన 12 సార్లు ఎన్నికల బరిలో దిగారు. ఇందులో ఒక్కసారి మినహాయిస్తే.. అన్ని సార్లు ఆయనే గెలిచారు. 2004లో కర్ణాటక అసెంబ్లీకి వరుసగా ఎనిమిదో సారి ఎన్నికై ఓ రికార్డు తన పేరిట రాసుకున్నారు. అంతేకాదు, చీతాపూర్ నుంచి అసెంబ్లీకి 9 సార్లు ఎన్నికై కూడా చరిత్ర సృష్టించారు.

80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే ఉన్నత నేతగా ఎదిగిన దళితుడు. కాంగ్రెస్ పార్టీకి దళిత నేత అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం ఇది రెండోసారి. తొలిసారి జగ్జీవన్ రామ్ ఈ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు దళిత అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు.

Also Read: ఖర్గే జీని అడగండి.. ఫలితాల ప్రకటనకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనేది చెప్పేసిన రాహుల్ గాంధీ..!

1942 జులై 21న జన్మించిన ఖర్గే 1969లో కాంగ్రెస్‌లో చేరారు. చివరిసారి ఆయన 2021 ఫిబ్రవరి 16న పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా చేరారు. ఈ నెల 1వ తేదీ వరకు రాజ్యసభల ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 

మన్మోహన్ సింగ్ హయాంలో ఆయన కార్మిక, ఉపాధి శాఖ, రైల్వే శాఖ మంత్రిగా చేశారు. 2014 నుంచి 2019 వరకు లోక్‌సభాపక్ష నేతగా ఉన్నారు. 

కర్ణాటక గుల్బర్గా లోని సేథ్ శంకర్‌లాల్ లాహోటీ కాలేజీలో లా చదివిన మల్లికార్జున్ ఖర్గే జూనియర్‌ గా లేబర్ యూనియన్ కేసులు ఎక్కువగా వాదించి గెలిపించారు. ఆ తర్వాత ఆయన లేబర్ యూనియన్ నేతగా ఎదిగారు. 1969లో గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడయ్యారు. 1972లో కర్ణాటక అసెంబ్లీకి పోటీ చేశారు. కీలకమైన ఆక్ట్రోయ్ అబాలిషన్ కమిటీకి ఆయన 1973లో చైర్మన్‌గా వ్యవహరించారు. కర్ణాటకలో పురపాలిక మండలిల ఆర్థికానికి ఇదేంతో సహకరించింది. ప్రభుత్వ లెదర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ కీలక పాత్ర పోషించారు. 1976లో రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడు సుమారు 16 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను క్లియర్ చేశారు.

Also Read: ఓడిన తర్వాత శశిథరూర్ ఏమన్నారు? పార్టీలో మార్పులపై కీలక వ్యాఖ్య

వీటితోపాటు ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ సహాయ మంత్రిగానూ వ్యవహరించారు. ఆయన సారథ్యంలో భూ సంస్కరణలు, సాగుదారులు, కూలీల హక్కులకూ అనుకూల నిర్ణయాలు జరిగాయి.

1990లో మాపన్న మల్లికార్జున్ ఖర్గే రెవెన్యూ, రూరల్ డెవలప్‌మెంట్, పంచాయత్ రాజ్ మంత్రిగా చేశారు. ఆ తర్వాత వీరప్ప మొయిలీ క్యాబినెట్‌లోనూ కోఆపరేషన్, మీడియా, లార్జ్ ఇండస్ట్రీల మంత్రిగా చేశారు. ఎస్ఎం క్రిష్ణ క్యాబినెట్‌లో హోం మంత్రి గానూ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios