ప్రముఖ ఆన్ లైన్ గేమ్ పబ్జీ ఆట ఆమె కొంపముంచింది. ఆన్ లైన్ పబ్జీ గేమ్ ఆడుతూ ఓ మైనర్ బాలికకు ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆమె దానిని స్వచ్ఛమైన స్నేహంగా భావించగా.. సదరు యువకులు మాత్రం దుర్భుద్దితో ఆలోచించారు. బాలికతో పరిచయం పెంచుకొని స్నేహంగా నటించారు.పథకం ప్రకారం ఓ రోజు బాలికను బయటకు పిలిచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ముగ్గురు యువకులను అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భూపాల్ లోని గౌతమ్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(14) కి లాక్ డౌన్ సమయంలో ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. వారితో కలిసి బాలిక పబ్జీ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. ఆ ముగ్గురితో బాలికకు స్నేహం బలపడింది. కాగా.. వాళ్లు పథకం ప్రకారం.. బాలికను బయటకు వెళదామని చెప్పి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లారు.

అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానంతటినీ వీడియో తీసి.. దానిని చూపించి బాలికను బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియో చూపించి.. బాలికను తాము ఉన్న ప్రాంతానికి రప్పించుకొని.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

వారి బెదిరింపులు రోజు రోజుకీ ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన బాలిక.. ఈ విషయాన్ని తన తల్లితో పంచుకుంది. వెంటనే.. తల్లి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు ప్రకారం పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  బాధితురాలి వయసు 14 సంవత్సరాలు అని.. ఆరో తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు విడిపోయారని.. ఆమె తల్లి ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోందని తెలుస్తోంది. కాగా,.. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.