ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదం షాక్ నుంచి ఇంకా దేశంలో కోలుకోక ముందే మ‌రో ప్ర‌మాదం జ‌రిగింది. ఉత్త‌ర‌ఖాండ్‌లో ఓ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళితే.. 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గౌరికుండ వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటన క‌ల‌క‌లం రేపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో కొంతమంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం రోజు ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం స్పష్టంగా తెలియరాలేదు. ఈ హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పైలట్‌తో పాటు కొందరు మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌కు చెందిన యాత్రికులు ఉన్నారు. ప్రమాదంలో ఒక చిన్నారి కూడా ఉందని సమాచారం.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందినదిగా అధికారులు తెలిపారు. కేదార్నాథ్ నుంచి గుప్తకాశికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ గౌరికుండలోని లోతైన ప్రాంతంలో కూలిందని తెలుస్తోంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి.

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్ బలగాలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.