- Home
- Telangana
- Rain Alert: అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్
Rain Alert: అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రం అంతటా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, వర్షాలు జూన్ 17 వరకు కొనసాగే అవకాశం ఉంది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలవకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే కానీ బయటకు వెళ్లకూడదుని హెచ్చరించారు.
రైతుల్లో ఆశలు, సాగుకు అనుకూల వాతావరణం
ఈ వర్షాలతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండటంతో రైతులు భూములను దున్నడం, విత్తనాలు చల్లడం మొదలుపెట్టారు. వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు ఇది ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
విత్తనాల మొలక, పంటల పెరుగుదలకు సహాయపడే వర్షాలు
ఈ వర్షాల వల్ల భూమిలో తేమ పెరిగింది. దీని వల్ల విత్తనాలు సులభంగా మొలకెత్తతాయి. పంటల ఎదుగుదలకు ఇది అనుకూలం. కొంతమంది రైతులు వరి నారు కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు ఇలా కొనసాగితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.