- Home
- National
- Air India Crash: విమానం క్రాష్ అయ్యే వీడియోను ఎవరు తీశారు.? పోలీసుల విచారణలో ఏం తేలిందంటే
Air India Crash: విమానం క్రాష్ అయ్యే వీడియోను ఎవరు తీశారు.? పోలీసుల విచారణలో ఏం తేలిందంటే
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్నే కాకుండా, ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. ఏకంగా 240కి పైగా మంది మరణించడం విమానయాన రంగంలో జరిగిన అత్యంత తీవ్ర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.

ప్రపంచాన్ని కుదిపేసిన ఘటన
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. టేకాఫ్ అనంతరం విమానం ఒక్కసారిగా కిందికి జారుతూ కుప్పకూలిన దృశ్యం హృదయాలను కలచివేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో విమానం గాల్లోకి లేచి కాసేపటికే కిందకు దిగుతూ ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
ఇంతకీ వీడియో ఎవరు తీశారు.?
ప్రతీ రోజూ ఎన్నో విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. మరి ఈ వీడియోను ఎందుకు రికార్డ్ చేశారన్న సందేహం రావడం సర్వసాధారణం. ఇందులో భాగంగానే అసలు ఆ వీడియోను ఎవరు తీశారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియోను 17 ఏళ్ల ఆర్యన్ అనే కుర్రాడు తీసినట్లు పోలీసులు తెలిపారు. విమానాశ్రయం సమీపంలోని ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆర్యన్‌కు విమానాల టేకాఫ్ వీడియోలు తీయడం హ్యాబీ.
ఈ దుర్ఘటన జరిగిన రోజు కూడా అలానే తన మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు తీస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అతడు తెలిపాడు. “వీడియో రికార్డ్ మొదలుపెట్టిన 14వ సెకనికే విమానం కూలిపోయింది. ఒక్కసారిగా దానిని చూసి షాక్‌కి లోనయ్యాను,” అని అతడు మీడియాతో చెప్పాడు.
ప్రమాదం తర్వాత బాలుడి భయానక అనుభవం
ఆర్యన్ సోదరి తెలిపిన వివరాల ప్రకారం, ఆ వీడియోను తొలుత ఆమెనే చూసి తండ్రికి తెలియజేసింది. ఆర్యన్‌కు పూర్తిగా భయంతో నోటి నుంచి మాట రాలేదన్నారు. ఆ రాత్రంతా నిద్ర పోలేదని చెప్పారు. ఆ రోజు ఏం తినలేదని, మౌనంగా మా ఇంట్లో గదిలోనే ఉన్నాడని ఇంటి యజమాని వెల్లడించారు. ఒక దశలో ఆర్యన్ ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం.
అరెస్టు వార్తలు ఖండించిన పోలీసులు
వీడియో తీసినందుకు ఆ బాలుడిని అరెస్టు చేశారన్న వార్తలపై స్పందించిన స్థానిక క్రైం బ్రాంచ్ అధికారులు... ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. "ఆ బాలుడు తన తండ్రితో కలిసి విచారణకు హాజరయ్యాడు. అతని వాంగ్మూలాన్ని మేము రికార్డు చేశాం. కానీ ఎటువంటి అరెస్టు జరగలేదు," అని పోలీసులు స్పష్టం చేశారు. ఆర్యన్ పూర్తిగా సహకరించాడని, వీడియో తీసిన పరిస్థితులను వివరంగా వెల్లడించాడని తెలిపారు.
దర్యాప్తు ముమ్మరం
ఈ దారుణ ఘటనపై ఇప్పటికే వివిధ విభాగాలు దర్యాప్తు ప్రారంభించాయి. విమాన దుర్ఘటనకు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. బ్లాక్‌బాక్స్ రికవరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటా, టెక్నికల్ లోపాలు అన్నీ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. పైలట్ విమానం కూలడానికి ముందు ఏటీసీతో నో పవర్ అని తెలిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.