లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో నలుగురు అగ్రకులాలకు  చెందిన యువకుల చేతిలో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబసభ్యులు  సోమవారం నాడు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచీ ముందు హాజరయ్యారు. తమ కూతురి అంత్యక్రియల సమయంలో తమను కనీసం చివరి చూపు కూడ చూడకుండా చేశారని ఆరోపించారు.

also read:హత్రాస్‌ ఘటన: కేసు నమోదు, దర్యాప్తునకు సీబీఐ బృందం

పోలీసులు, జిల్లా యంత్రాంగం వేధింపులకు గురి చేసిందని వారు హైకోర్టుకు తెలిపారు. ఈ విషయమై తాము పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో కనీసం వారు స్పందించలేదని  కోర్టు దృష్టికి తెచ్చారు. తమపై జిల్లా యంత్రాంగం ఒత్తిడి తెచ్చిందని కూడ చెప్పారు. ఘటన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలను ఐదుగురు కుటుంబసభ్యులు కోర్టుకు వివరించారు. 

ఈ కేసు విచారణను నవంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది కోర్టు. బాధితుల వాదనలను పంకజ్ మిఠల్, రంజన్ రాయ్ ధర్మాసనం ఇవాళ విన్నది.
మృతురాలి తల్లిదండ్రులు, తోబుట్టువుల నుండి కోర్టు స్టేట్ మెంట్ రికార్డు చేసింది. 

హత్రాస్ డీఎం, ఎస్పీతో పాటు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని రాత్రిపూట మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి లేదని డీఎం తెలిపారు.

ఈ కేసును అలహాబాద్ నుండి యూపీకి మార్చాలని కోరారు. అంతేకాదు బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని మృతురాలి కుటుంబం తరపు న్యాయవాది కోర్టును కోరారు.  సీబీఐ నివేదికలను రహస్యంగా ఉంచాలని ఆయన కోరారు.