చెన్నై: తమిళనాడులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం కోళికోట్టై సమీప ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.

ఆమెకు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలోని వెప్పన్ పల్లికి చెందన ధరణి (22) అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇరువురు ప్రేమించుకున్నారు. ప్రేమికుడిని చూడాలని బాలిక తహతహలాడింది. 

దాంతో తనను కృష్ణగిరికి తీసుకుని వెళ్లాలని తనకు ఇదివరకే పరిచయం ఉన్న కృష్ణగిరి జిల్లా మనాసెరికి చెందిన విభిన్ రాజ్ (22)ను అడిగింది. విబిన్ రాజ్ తన మిత్రులు అకిత్ రాజ్ (23), జెబిన్ (23)లతో ఈ నెల 2వ తేదీన బాలికను కృష్ణగిరికి తీసుకుని వెళ్లాడు. 

ఆ సమయంలో నడుస్తున్న కారులోనే బాలికపై ముగ్గురు కూడా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను ఓ బస్టాండులో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని బాలిక తన ప్రియుడికి వెంటనే తెలిపింది. అతను బాలికను బంధువు ఇంటికి తీసుకుని వెళ్లాడు. 

కూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు కేరళ రాష్ట్రంలోని ముక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలిక కృష్ణగిరిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి దరణిపై కేసు నమోదు చేశారు.  బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.