కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానుషమైన సంఘటన చోటుచేసుకంది. దీపావళి పర్వదినం రోజు ఆరేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. ఈ కేసులో నిందితులు అంకుల్ కురిల్ (20), బీరన్ (31)లను పోలీసులు ఆదివారం ఆరెస్టు చేశారు. అయితే, బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేశారని పోలీసులు చెప్పారు. 

బాలిక మృతదేహం నుంచి ఊపిరితిత్తులను బయటకు తీశారు. క్షుద్రపూజలు చేయడానికి ఊపిరితిత్తులను బయటకు తీశారని పోలీసులు చెప్పారు. మహిళ శిశువుకు జన్మనిస్తుందనే నమ్మకంతో బాలికపై అత్యాచారం చేసి, ఆమెను చంపి క్షుద్రపూజలు చేయడానికి మృతదేహం నుంచి ఊపిరితిత్తులను బయటకు తీశారని వారు చెప్పారు.

ఊపిరితిత్తులను నిందితులు ప్రధాన సూత్రధారి పర్సురామ్ కురిల్ కు క్షుద్రపూజలు చేయడానికి ఇచ్చారని పోలీసులు చెప్పారు. పర్సురామ్ ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారమంతా ఆమెకు కూడా తెలుసునని భావించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

పర్సురామ్ తొలుత పోలీసులను తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించాడు. అయితే, విచారణలో బోరున ఏడ్చేసి నేరాన్ని అంగీకరించాడు. తనకు 1999లో వివాహమైందని, అయితే పిల్లలు పుట్టలేదని  చెప్పాడు. దాంతో అంకుల్, బీరన్ లకు చెప్పి బాలికను కిడ్నాప్ చేయించి, ఊపిరితిత్తులను బయటకు తీయించానని చెప్పాడు. 

బద్రాస్ గ్రామంలోని తన ఇంటి నుంచి శనివార రాత్రి క్రాకర్స్ కొనుక్కోవడానికి బయటకు వచ్చిన సమయంలో అంకుల్, బీరన్ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో వారు మద్యం సేవించి ఉన్నారు. బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశారు.