అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్య‌వ‌హార శైలి గంద‌ర‌గోళంగా ఉంది. ముఖ్యంగా భార‌త్‌ను టార్గెట్ చేసుకొని ఆయ‌న చేస్తున్న కొన్ని వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఆస‌క్తిని పెంచుతోంది. 

భార‌త్‌పై ఒత్తిడి తెస్తున్న అమెరికా

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంద‌న్న‌ కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వాణిజ్య భాగస్వామిగా సక్రమంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ, వచ్చే 24 గంటల్లో అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. రష్యాతో భారత ఇంధన ఒప్పందాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్ష మద్దతు ఇస్తున్నట్లుగా ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ట్రంప్ వ్యాఖ్యల నడుమ డోభాల్‌ రష్యా పర్యటన

ఈ ఉద్రిక్త వాతావరణంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ రష్యాకు వెళ్లారు. ఆయన పర్యటన ముందే ప్రణాళికలో భాగమని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ, ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇది కొత్త చర్చలకు దారితీస్తోంది. మాస్కోతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన ఉందని సమాచారం.

రక్షణ ఒప్పందాలు, కొత్త చర్చలు

డోభాల్‌ మాస్కో పర్యటనలో ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలక రక్షణ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రష్యా నుంచి చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారం వంటి ఆర్థిక ఒప్పందాలు కూడా చర్చల అజెండాలో ఉండే అవకాశం ఉంది.

త్వ‌ర‌లో జైశంకర్‌ పర్యటన

విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కూడా ఈ నెలాఖరులో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన ఒప్పందాలు, వాణిజ్య అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరగనుంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో సమావేశం కూడా షెడ్యూల్‌లో ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

భారత్‌ వ్యూహం ఏంటి.?

ఒకవైపు అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతుండగా, మరోవైపు రష్యాతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించడం భారత్‌ ముందున్న ప్రధాన సవాలు. ఉక్రెయిన్‌ యుద్ధం, గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్ల అనిశ్చితి, రక్షణ అవసరాలు అన్నీ కలిసి భారత్‌ నిర్ణయాలను క్లిష్టం చేస్తున్నాయి. మాస్కోలో జరిగే ఈ చర్చలు భారత్‌ భవిష్యత్‌ వ్యూహానికి కీలక సూచనలుగా భావిస్తున్నారు. దీంతో అస‌లు భార‌త్ వ్యూహం ఏంట‌న్న చ‌ర్చ తెర‌పైకి వ‌స్తోంది.