ఆగ్రాలో అక్రమంగా నివసిస్తున్న 32 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
Agra: ఆగ్రాలో అక్రమంగా నివసిస్తున్న 32 మంది బంగ్లాదేశీ పౌరులను అరెస్టు చేశారు. 12 ఏళ్లుగా దేశంలో అక్రమంగా నివసిస్తున్న నలుగురు పిల్లలతో సహా 32 మంది బంగ్లాదేశ్ పౌరులను ఆగ్రా పోలీసులు అరెస్టు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. నిఘా వర్గాల హెచ్చరికల క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.

32 Bangladeshi nationals arrested: దేశంలో అక్రమంగా నివసిస్తున్న 32 మంది బంగ్లాదేశీయులను ఆగ్రా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జీ-20 అతిథుల రాకకు మూడు రోజుల ముందు ఈ అరెస్టులు జరిగాయి. ఫిబ్రవరి 10న వచ్చి 12 వరకు బస చేయనున్న జీ20 దేశాల అతిథులకు స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు పూర్తి ఉత్సాహంతో ఆగ్రాను అలంకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ విభాగం బృందాలు కూడా ఆగ్రాలో క్రియాశీలకంగా మారాయి, ఫలితంగా ఆగ్రా పోలీసులు మంగళవారం 32 మంది అనుమానిత బంగ్లాదేశీ చొరబాటుదారులను అరెస్టు చేశారు. వీరిలో 15 మంది పురుషులు, 13 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. పెద్దలను జైలుకు పంపగా, పిల్లలను జువైనల్ హోంల్లో ఉంచారు.
ఆగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీలోని సెక్టార్ 4లో ఈ బంగ్లాదేశీయులు గుడిసెలు వేసుకుని స్థిరపడ్డారు. వారి నుంచి 35 ఆధార్ కార్డులు, ఒక పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై నకిలీ పత్రాలు కలిగి ఉండటం, మోసాలకు పాల్పడటం, విదేశీయుల చట్టం కింద సికంద్ర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బంగ్లాదేశీయుల గురించి ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ బృందానికి సమాచారం అందిందని, దాని ఆధారంగా సికంద్రా ప్రాంతంలోని ఆవాస్ వికాస్ సెక్టార్ 4లో తనిఖీలు నిర్వహించామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో 32 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారనీ, దొడ్డిదారిలో భారత పౌరసత్వం పొందారని అరెస్టు చేసి జైలుకు పంపామని ఆగ్రా డీసీపీ వికాస్ కుమార్ తెలిపినట్టు ఇండియా టుడే నివేదించింది.
ఆ కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ జాతీయుడైన హలీం మాట్లాడుతూ.. తాను బరోర్హాట్ జిల్లా నివాసి అనీ, 12 సంవత్సరాలుగా ఆగ్రాలో నివసిస్తున్నానని చెప్పాడు. పశ్చిమబెంగాల్ లోని ఓ ఏజెంట్ ద్వారా తనతో పాటు పలువురు సహచరులు భారత్ లోకి ప్రవేశించారనీ, వారంతా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్నారని చెప్పారు. బ్రోకర్ల ద్వారా గుర్తింపు పత్రాలు సిద్ధం చేయించుకున్నాడు. వీరు ఎక్కువగా చెత్త ఏరుకునేవారిగా పనిచేస్తారనీ, హవాలా ద్వారా తమ దేశాలకు డబ్బును పంపుతున్నారని చెప్పారు. బంగ్లాదేశ్ లోని ఓ గ్రామానికి, పశ్చిమబెంగాల్ సరిహద్దుకు మధ్య నది ఉంది. సరిహద్దు గ్రామాల్లో చురుగ్గా ఉన్న దళారులు నదిని దాటడానికి రూ.15,000 - 20,000 వసూలు చేస్తారు. వారు గ్రామీణ మార్గం ద్వారా సీల్దా-హౌరాకు చేరుకుంటారు, తరువాత రైలులో చెన్నై, ఢిల్లీ, ఆగ్రా మొదలైన నగరాలకు వచ్చి స్క్రాప్ వ్యాపారం ప్రారంభిస్తారని సమాచారం.
ఆధార్ కార్డు, పాన్ కార్డు, నకిలీ డాక్యుమెంట్ల తయారీకి సుమారు రూ.1,000 ఖర్చవుతోందని హలీమ్ తెలిపారు. చాలా మంది ఎల్ఐసీ పాలసీ కూడా చేయించుకున్నారు. ఆగ్రాలో కూడా ఇలాంటి ఏజెంట్లు చాలా మంది క్రియాశీలకంగా ఉన్నారని సంబంధిత కథనం పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని డీసీపీ వికాస్ కుమార్ తెలిపారు. ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆగ్రాలో ఇంకా ఎక్కువ మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆగ్రాలో 200 మందికి పైగా బంగ్లాదేశీయులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందింది. సికంద్రా ప్రాంతంలో ఇది మొదటి కేసు కాదని సామాజిక కార్యకర్త విజయ్ ఉపాధ్యాయ్ తెలిపారు. 2019లో బంగ్లాదేశీయులు ఖాళీ స్థలంలోనే సెటిల్ అయ్యారు. ఇక్కడే సయీద్ ఉల్ హసన్ ఘాజీ అనే బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ పెద్ద ఇల్లు కట్టుకోవడంతో పాటు కారు, ప్లాట్ వంటివి అతను కొన్నాడని సమాచారం.
కూరగాయలు అమ్మే ముసుగులో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఫాతిమా అనే బంగ్లాదేశ్ మహిళను 2017లో ఎత్మదుదౌలా ప్రాంతంలో అరెస్టు చేశారు. వీసా లేకుండా భారత్ కు వచ్చిన ఆమె ఇక్కడ షేర్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు ఎన్ ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఆగ్రా జోన్ లోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు బంగ్లాదేశీయుల పేర్లను కూడా ఆమె వెల్లడించారు.