Asianet News TeluguAsianet News Telugu

క‌ర్నాట‌క‌లో లంపీ స్కిన్ డిసీజ్ తో 2 వేల ప‌శువులు మృతి.. టీకాలు వేయించాలంటూ సూచ‌న‌లు

Bengaluru: ఎల్ఎస్డీ అనేది ఒక అంటువ్యాధి. ఈ  వైరల్ వ్యాధి ప‌శువుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. దీని కార‌ణంగా ప‌శువుల్లో తీవ్ర జ్వరం, చర్మంపై నోడ్యూల్స్ ఏర్ప‌డి వాటి మరణానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగల ద్వారా పశువులను తాక‌డం లేదా కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది.
 

2 thousand cattle died of lumpy skin disease in Karnataka; Recommendations for Vaccination
Author
First Published Oct 15, 2022, 5:09 AM IST

lumpy skin disease: లంపీ స్కిన్ వ్యాధి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే దేశంలోని చాలా ప్రాంతాల్లో వేలాది ప‌శువులు ఈ వైర‌ల్ వ్యాధి కార‌ణంగా మ‌ర‌ణించాయి. ల‌క్ష‌లాది ప‌శువుల‌కు ఈ చ‌ర్మ‌వ్యాధి సోకింది. మొద‌ట ఉత్త‌ర‌భార‌త‌లో పెద్ద ఎత్తున ప‌శువులు ఈ వ్యాధి బారిన‌ప‌డ్డాయి. ఇప్పుడు ద‌క్షిణ భార‌తంలో కూడా లంపీ స్కిన్ డీసీజ్ వ్యాప్తి క్ర‌మంగా అధికం అవుతోంది. కర్నాటకలో లంపి స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డీ) కారణంగా 2,070 పశువులు చనిపోయాయి. అలాగే, మ‌రో 19,000 ప‌శువులు తీవ్రంగా ప్రభావితమయ్యాయ‌ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

ఈ వైరల్ వ్యాధితో బాధపడుతున్న పశువులకు చికిత్స, టీకాలు వేయడానికి ₹ 13 కోట్లు విడుదల చేయాలనీ, దాని కారణంగా పశువులను కోల్పోయిన వారికి ఉపశమనం కలిగించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌శువుల్లో సోకే ఈ చ‌ర్మ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని యంత్రాంగాన్ని సీఎం అప్ర‌మ‌త్తం చేశారు. ముఖ్యంగా హవేరి, కోలార్ జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. “ఈ ప‌శువుల‌కు సోకే లంపీ స్కిన్ డిసీజ్ ను 28 జిల్లాల్లోని 160 తాలూకాలలోని 4,380 గ్రామాల్లో గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడిన మొత్తం 45,645 పశువుల్లో 26,135 కోలుకోగా, 2,070 చనిపోయాయి" అని తెలిపారు. 

ఈ లంపీ స్కిన్ కార‌ణంగా పశువులను కోల్పోయిన వారికి పరిహారంగా ఇప్పటికే ₹ 2 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. వ్యాధి సోకిన పశువుల చికిత్సకు అదనంగా ₹ 5 కోట్లు, వాటికి టీకాలు వేయడానికి ₹ 8 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే, ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌శువులు ఈ చ‌ర్మ వ్యాధి బారిన‌ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు.. రైతుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్న‌ట్టు తెలిపింది. కాగా, 6,57,000 పశువులకు టీకాలు వేసినట్లు ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై  తెలిపారు.

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధిని గుర్తించిన ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఆరోగ్యవంతమైన పశువులకు కూడా తప్పనిసరిగా టీకాలు వేయించాలి. "దీర్ఘకాలిక ప్రభావిత జిల్లాల్లో టీకాలు వేయాలి" అని ముఖ్యమంత్రి చెప్పారు. భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల నుండి వెంటనే 15 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను పొందాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న ఆవుల పాలు తాగడం వల్ల చ‌ర్మ వ్యాధి ప్రజలకు వ్యాపించదనీ, ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని బ‌స‌వ‌రాజ్ బొమ్మై సూచించారు.

లంపీ స్కిన్ డీసీజ్ ప్ర‌భావం అధికంగా ఉన్న హవేరి, కోలార్ వంటి తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలలో ఈ వ్యాధిని తనిఖీ చేయడానికి స‌త్వ‌ర‌ చర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ఇతర జిల్లాలకు వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టాల‌ని సూచించారు. టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా, లంపీ స్కిన్ డిసీజ్  (ఎల్ఎస్డీ) అనేది ఒక అంటువ్యాధి. ఈ  వైరల్ వ్యాధి ప‌శువుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. దీని కార‌ణంగా ప‌శువుల్లో తీవ్ర జ్వరం, చర్మంపై నోడ్యూల్స్ ఏర్ప‌డి వాటి మరణానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగల ద్వారా పశువులను తాక‌డం లేదా కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios