రాఖీ అంటే రక్షణ అని అర్థం. మనతోపాటు రక్తం పంచుకు పుట్టిన అన్న , తమ్ముడు కి ఆడపిల్లలు ఈ రాఖీ పడతారు. తల్లిదండ్రుల తర్వాత అన్నీ తానై.. తమను రక్షించాలనే కారణంతో ఈ రాఖీ కడతారు. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. అది ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. కేవలం సోదరీసోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది. 


రాఖీని ఏ సమయంలో కట్టాలి ఎవరికి కట్టాలి 
శ్రావణ పౌర్ణమి రోజు తెల్లవారుజామున స్నానాలు ఆచరించి.. మనం  కట్టబోయే రక్షిక  (రాఖీ)ను  దేవుడిముందు ఉంచి పూజించాలి. పెళ్లిలో మాంగల్యానికి ఎలా పూజ చేసి  దానిలోకి దైవశక్తిని ప్రవేశింప చేస్తామో.. అలాగే  రాఖీకి పూజ  చేయాలి. అంటే పూజ ద్వారా దైవ శక్తిని ఈ రక్షకి లోకి ప్రవేశింప చేయాలి.   పూజ ద్వారా దైవశక్తిని దానిలోకి ప్రవేశింప చేయాలన్నమాట.  అనంతరం ఈ రక్షకిని ఒక సంవత్సరం పాటు  మనం ఎవరిని ఏడాది పాటు రక్షించటానికి అండగా నిలువ దలిచామో వారి  ముంజేతికి  కడుతూ తప్పక అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నానంటూ ప్రకటిస్తూ ఆ రాఖీమీద  అక్షింతలను వేయాలి.  

దీనిని మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3గంటలలోపు కడితే మంచి జరుగుతుందనేది నమ్మకం. ఈరోజు ముహూర్తం ప్రకారం సాయంత్రం ఆరింటి వరకు కూడా కట్టుకోవచ్చు.  ఈవిధానాన్ని గర్గ్యుడనే మహర్షి  చెప్పాడని శాంతి కమలాకరంలో ఉంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదని ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమని  తెలుస్తోంది.  రక్షా బంధనం కట్టటం పూర్తయింది కదా అని  ఇక వదిలేయకూడదు.  మాటకు కట్టుబడి ఆమెకు సంవత్సరం పాటు అండగా నిలబడాలి.