ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ప్రతీ ఏటా వేలాది మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే భవిష్యత్తులో క్యాన్సర్ మరణాలు ఉండవా అంటే అవుననే సమాధానం వస్తోంది.
కేన్సర్‌ను పూర్తిగా నివారించే అవకాశం?
అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన బ్రెస్ట్ క్యాన్సర్ (స్థన్య కేన్సర్) కు పరిష్కారం దొరికినట్టే కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు రూపొందించిన ఓ కొత్త రకం వ్యాక్సిన్ ఫేజ్ వన్ (దశ-1) క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న మహిళల్లో 75% మందికి పైగా శక్తివంతమైన రోగనిరోధక ప్రతిస్పందన కనిపించింది.
ఈ వ్యాక్సిన్ కేవలం క్యాన్సర్ నివారణ కోసమే కాదు, ఉన్న క్యాన్సర్‌ను తగ్గించేందుకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. ఇప్పటి వరకు క్యాన్సర్ వ్యాక్సిన్‌లు చాలా కష్టంగా తయారయ్యాయి. కానీ ఈసారి ప్రయోగాలు విజయవంతం కావడం పరిశోధకులకు కొత్త ఆశను కలిగిస్తోంది.

ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యాక్సిన్ అల్ఫా లాక్టాల్బుమిన్ అనే ఒక ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ ప్రోటీన్ సాధారణంగా గర్భధారణ సమయంలో లేదా బాలింత సమయంలో మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ ప్రోటీన్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
పాలుగలించే ప్రోటీన్‌గా ఉన్న ఈ అల్ఫా లాక్టాల్బుమిన్ ప్రోటీన్‌ను శరీరం గుర్తించి, దానిపై యాంటీబాడీలను రూపొందించేలా వ్యాక్సిన్ పనిచేస్తుంది. దీని ద్వారా శరీరం క్యాన్సర్ కణాలను త్వరగా గుర్తించి వాటిపై దాడి చేయగలదు.

మొదటి దశలో ఏం జరిగింది?
ఈ ఫేజ్-1 ట్రయల్స్‌లో మొత్తం 35 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు. ఇది అత్యంత ప్రమాదకరమైన బ్రెస్ట్ క్యాన్సర్ రకం. ఈ వ్యాధితో పోరాడేందుకు అంతకు ముందు ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ డబుల్ మాస్టెక్టమీ అనే శస్త్రచికిత్స చేయించుకుంది.
ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 75% మందికి యాంటీబాడీలు ఎక్కువగా కనిపించాయి. అంటే, శరీరం వ్యాక్సిన్‌ను గుర్తించి, ఆ లక్ష్య ప్రోటీన్‌పై స్పందించడం ప్రారంభించిందని అర్థం. అయితే ఈ టీక ఇచ్చిన చోట కాస్త ఇర్రిటేషన్ మాత్రమే కనిపించింది. ఇది చాలా తక్కువ మైనర్ లక్షణం.
క్యాన్సర్ వ్యాక్సిన్ గతంలో ఎందుకు విఫలమయ్యాయంటే?
క్యాన్సర్ వ్యాక్సిన్‌లు ఇంతవరకు ఎందుకు విజయవంతం కాలేదు అనేది ముఖ్యమైన ప్రశ్న. సాధారణ వ్యాక్సిన్‌లు వైరస్‌లను లక్ష్యంగా చేసుకుంటాయి. అవి శరీరానికి బహిర్గత శత్రువులు. కానీ క్యాన్సర్ కణాలు మన శరీరంలోనే ఉత్పన్నమవుతాయి. అందుకే రోగనిరోధక వ్యవస్థ వాటిని విదేశీ శత్రువులుగా గుర్తించలేకపోతుంది.
గతంలో చేసిన కొన్ని వ్యాక్సిన్ ట్రయల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసేలా మారిపోయాయి. కానీ ఈ కొత్త వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ జీవితంలో కనిపించని ఒక ప్రోటీన్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రమాదం తక్కువగా ఉంది.

రెండో దశ ట్రయల్స్ ఎప్పుడు?
ఈ ప్రయోగం విజయవంతమవుతున్న నేపధ్యంలో ఇప్పుడు రెండవ దశ ట్రయల్స్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ దశలో ఎక్కువ మంది పాల్గొంటారు. అలాగే ట్రిపుల్ నెగటివ్ కాకుండా ఇతర రకాల బ్రెస్ట్ క్యాన్సర్ రోగులపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని పరీక్షించనున్నారు.
ఇది కేవలం నివారణ మాత్రమే కాదు. వ్యాధి వచ్చిన తర్వాత కూడా చికిత్సకు ఉపయోగపడేలా ఇది రూపుదిద్దుకుంటోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు దీనిని ఆసక్తిగా గమనిస్తున్నారు.

భవిష్యత్‌లో క్యాన్సర్ అంతమయ్యేనా?
ఈ ప్రయోగానికి అమెరికా రక్షణ విభాగం మద్దతు ఇచ్చింది. అయితే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కత్తిరింపు చేస్తే కొంత అవరోధం ఏర్పడే అవకాశం ఉందని అనిక్సా బయోసైన్సెస్ సీఈఓ డాక్టర్ అమిత్ కుమార్ తెలిపారు.
అయినా సరే, వారి జట్టు పూర్తి ఉత్సాహంతో రెండవ దశకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా అందించబోయే నివేదికలతో మరింత బలపడతాయి. వ్యాక్సిన్ విజయవంతమైతే ఇది తొలి "అసలైన" క్యాన్సర్ వ్యాక్సిన్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రస్తుతం ఆశాజనక దశలో ఉంది. ఇది ప్రపంచంలోని మిలియన్ల మంది మహిళలకు కొత్త జీవితం ఇవ్వగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం వైద్య విజ్ఞానమే కాదు మహిళల ఆరోగ్య భవితవ్యాన్ని మార్చగల పెద్ద పరిష్కారం కావచ్చు.


