Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు అదంటే కడుపుమంట... అందుకే ఈ రాజకీయ వ్యభిచారం: ధర్మశ్రీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేేత చంద్రబాబు నాయుడిపై ఫైర్ అయ్యారు.

YSRCP MLA Karanam Dharmasri fires on Chandrababu Naidu
Author
Amaravathi, First Published Jan 8, 2020, 5:32 PM IST

తాడేపల్లి: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు రాజధానిపై రగడ సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆయన చర్యలన్నింటికి ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంఎల్‌ఏ కరణం ధర్మశ్రీ అన్నారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్ గా మార్చారని... దీన్ని సరిచేయాలని తాము ప్రయత్నిస్తుంటే అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. 

రాజకీయప్రయోజనాల కోసమే ఆయన లా అండ్‌ ఆర్డర్‌ కు విఘాతం కలిగిస్తున్నారని... రాజధాని రైతులో పేరుతో ఇదంతా చేస్తూ వారిని ఇబ్బందులపాలు చేస్తున్నాడని అన్నారు. ఇలా మంగళవారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్‌ కుమార్‌ లపై రైతుల ముసుగులో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ స్వార్ధంతో చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను నేను ఖండిస్తున్నానని అన్నారు.

చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని, దిగజారే చర్యలను రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఓ బృహత్తర ఆలోచన చేసి ఈ ప్రాంత అభివృద్ది సాధించాలని ప్రతిపాదనను అసెంబ్లీలో క్లియర్‌ గా చెప్పడం జరిగిందన్నారు. అమరావతిని కొనసాగిస్తూ అసెంబ్లీని ఇక్కడే ఉంచి ఎడ్యుకేషన్‌ హబ్‌ గా తయారుచేయాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు.

ఉత్తరాంధ్ర అంతా వెనకబడి ఉంది కాబట్టి అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ గా, రాయలసీమను జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ గా ఏర్పాటు చేస్తే మూడు ప్రాంతాలు సమగ్రంగా అభివృధ్ది అవుతాయని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.  శివరామకృష్ణ కమిటి, శ్రీ కృష్ణ కమిటి, ఇప్పటి జిఎన్‌ రావు కమిటి, బోస్టన్‌ కమిటి గాని అన్నీ కూడా ఒకే రీతిలో అభివృధ్ది వికేంద్రీకరణ జరగాలని చెబుతున్నాయని అన్నారు. అధికారం కేంద్రీకృతం అయితే తిరిగి తెలంగాణా ఉద్యమంలాంటిది వచ్చే అవకాశం ఉందన్నారు.

read more  రాజధాని సెగ: ఆగిన మరో రైతు గుండె.. ఒకే రోజు ఇద్దరి మరణం, అమరావతిలో విషాదం

ప్రాంతీయ అసమానతలు తొలగించే విధంగా ఇచ్చిన రిపోర్ట్,ఆ రిపోర్ట్‌ కు అనుగుణంగా జగన్‌ ఇచ్చిన ప్రతిపాదనలు అందరికి ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు.చంద్రబాబు మాత్రం కుటిల,దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ కేవలం ఓ ప్రాంతానికి చెందిన నేతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

నేషనల్‌ ఫ్రంట్, యునైటెడ్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ ని అని మొదట చెప్పుకునే చంద్రబాబు ఆ తర్వాత ఉమ్మడి ఏపి సిఎంని, విభజన అనంతరం ఏపి తొలి ముఖ్యమంత్రిని అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఓ ప్రాంతానికి చెందిన నాయకుడినని చెప్పుకునే పరిస్థతి వచ్చిందన్నారు. 

ప్రతిపక్షనేతగా కూడా సరయిన పాత్ర పోషించకుండా కులానికో, ప్రాంతానికో పరిమితమై ఆయన చేస్తున్న రాజకీయ రగడను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. తన సహచరులు పిన్నెల్లిపైన,దళిత ఎంఎల్‌ ఏ కైలే అనిల్‌ కుమార్‌  పై చేసిన దాడితో ఆయన రాజకీయంగా భస్మమైపోయాడని హెచ్చరించారు. 

రాజధాని ఉత్తరాంధ్రకు పోతున్నట్లు అమరావతిలో పూర్తిగా రాజధాని తీసేస్తున్నట్లు చంద్రబాబు బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇక్కడ మాట్లాడిన మాటల్నే ఉత్తరాంధ్రకు వచ్చి మాట్లాడాలని... అప్పుడు ఆయన జుట్టు పట్టుకొని కొట్టడం ఖాయమన్నారు. ఎంతో శాంతికాములైన ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. 

 ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంటో అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్తులో  ఆయనకు రాజకీయ తంటా తప్పదన్నారు. పోలీసులతో  టిడిపి మాజి ఎంఎల్‌ఏ బొండా వ్యవహరించిన తీరును చూస్తుంటే ఆయన ఇంటిపేరు బొండా నా లేక గూండానా అన్న అనుమానం కలిగిందన్నారు.

read more  ఇవాళ శారదాపీఠం స్వామీజీతో... త్వరలో కేసిఆర్ తో జగన్ భేటీ... స్కెచ్ ఏమిటంటే: యనమల

రైతులు ప్యాంట్‌ షర్ట్‌ వేసుకుంటే తప్పా అని లోకేశ్ అడుగడం విడ్డూరంగా వుందని... అసలు ఆయనకు రైతంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ప్రత్యక్షరాజకీయాల్లోకి దొడ్డిదారిన ప్రవేశించిన ఆయన పరిస్దితి రైతులకు తెలుసన్నారు. తెలుగుపదాలు కూడా సరిగా పలకలేని ఆయన దైన్యస్దితిలో లోకేశ్ వున్నారని... రైతును పరామర్శించడానికి వెళ్తూ పరవశించిపోయానంటావా?నీవా రైతు గురించి మాట్లాడేది అని నిలదీశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios