Dasara Holidays : ఈసారి దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు, ఎన్నిరోజులో తెలుసా?
దసరాకి ఇంకా నెలరోజులకు పైగానే సమయం ఉంది. కానీ పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారు ఇప్పట్నుంచే ట్రైన్, బస్సు టికెట్స్ బుక్ చేసుకుంటారు… ఇలా అప్పుడే దసరా హడావిడి మొదలయ్యింది. మరి ఈ దసరాకి సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకో తెలుసా?

దసరా హాలిడేస్ 2026
Dasara Holidays : తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగలు దసరా, సంక్రాంతి. తెలంగాణలో దసరా పెద్దపండగ అయితే ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. అందుకే ఈ రెండు పండగలప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు మూతపడతాయి... స్కూల్ పిల్లలు, కాలేజీ యువతకు వరుస సెలవులు వస్తాయి. ఈ పండగలకు నగరాలు, పట్టణాల్లో చదువకునే విద్యార్థులంతా సొంతూళ్లకి వెళ్లి ఎంజాయ్ చేస్తారు... సొంతోళ్ల మధ్య పండగలు జరుపుకుంటారు.
అయితే తెలుగోళ్ల పెద్దపండగల్లో ఒకటైన దసరా (విజయదశమి) వచ్చే నెల (అక్టోబర్) లోనే ఉంది. ఈ పండక్కి సమయం దగ్గరపడుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్స్ సిద్దం చేస్తున్నారు. అయితే ముందస్తుగానే రైలు, బస్సు టికెట్స్ బుక్ చేయాలంటే దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకో తెలియాలి. మరి విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు ఎన్నిరోజులో ఇక్కడ తెలుసుకొండి... సొంతూళ్లకు వెళ్లేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకొండి.
తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు...
ఈసారి దసరా పండగ అక్టోబర్ 20 ( మంగళవారం) వస్తోంది. అయితే పండక్కి ముందే నవరాత్రి వేడుకలు ప్రారంభం అవుతాయి.. అంటే అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిదిరోజులు పూజలు చేస్తారు. ఇక బతుకమ్మ వేడుకలు కూడా తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతాయి. అందుకే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ దసరా పండక్కి భారీగా సెలవులు ఇస్తుంటాయి.
దసరా వేడుకలు మొదలైప్పటి నుండి పూర్తయ్యేవరకు విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది... ఈసారి తెలంగాణలో అక్టోబర్ 10 నుండి 22 వరకు హాలిడేస్ ఇచ్చారు. అంటే అక్టోబర్ 9న మూతపడే విద్యాసంస్థలు అక్టోబర్ 23న తిరిగి తెరుచుకోన్నాయన్నమాట... వరుసగా 13 రోజులు సెలవులే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో చదివి విద్యార్థులందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. కాలేజీలకు ఈస్థాయిలో సెలవులుండవు... కాస్త తక్కువగా ఉంటాయి.
తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఎప్పట్నుంచి ఎప్పటివరకు?
తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే పూల పండగే బతుకమ్మ. రంగురంగుల (గునుగు, తంగేడు, బంతి వంటి) పూలతో బతుకమ్మను పేర్చి ఆటాపాటలతో వేడుకలు జరుపుకుంటారు... ఇలా ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా తొమ్మిరోజుల పాటు ఆడబిడ్డలు సంబరాల్లో మునిగిపోతారు. ఈసారి కూడా బతుకమ్మ వేడుకలకు యావత్ తెలంగాణ సిద్దమవుతోంది... మహాలయ అమావాస్య రోజు అంటే అక్టోబర్ 11న ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం అవుతాయి... ఒక్కోరోజు ఒక్కో పేరుతో వేడుకలు జరుగుతాయి... చివరగా అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగియనున్నాయి.
అక్టోబర్ 18న (ఆదివారం) సద్దుల బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ఆడబిడ్డలందరూ పాల్గొంటారు... బతుకమ్మ చుట్టూచేరి ఆడిపాడతారు. ఈ బతుకమ్మ సంబరాలు జరిగినన్నిరోజులు తెలంగాణ జానపద పాటలు గట్టిగా వినిపిస్తారు... 'గౌరమ్మ ఉయ్యాలా... మా బొడ్డెమ్మ ఉయ్యాలా' అంటూ సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటారు. అందంగా ముస్తాబయ్యే ఆడపడుచుల నోట ఈ పాటలు వినిపిస్తుంటాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు?
తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు కాస్త తక్కువగా ఉంటాయి. ఏపీ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం... అక్టోబర్ 12 నుండి 21 వరకు దసరా సెలవులున్నాయి. అంటే తెలంగాణలో వరుసగా 13 రోజులు హాలిడేస్ ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం 10 రోజులు మాత్రమే దసరా సెలవులున్నాయి.
అయితే సంక్రాంతి పండక్కి తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు ఎక్కువరోజులు సెలవులు వస్తాయి. దేశవిదేశాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలు సైతం ఈ పండక్కి సొంతూళ్లకు వెళతారు... వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా సంక్రాంతి పండక్కే ఎక్కువ సెలవులు ఇస్తుంటుంది.

