పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీ: మైనస్ పాయింట్లు ఇవీ...
పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం 2008లో జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యాం పార్టీకి అనుబంధ యువజన విభాగం యువరాజ్యం అధినేతగా ఆయన పనిచేశారు. ప్రజారాజ్యం కోసం విస్తృతంగా పర్యటించారు. ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయనకు విశేషమైన ప్రజాదరణ లబించింది.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగులో ఏ హీరోకు కూడా లేనంత అభిమానుల సంపద ఉంది. పవన్ కల్యాణ్ మీద ఈగ వాలితే కూడా సహించనంత అభిమానం వారిలో ఉంది. పవన్ కల్యాణ్ కోసం ఎంత వరకైనా వెళ్లే తెగువ కూడా వారికి ఉంది. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన వెంట నడిచే దండు ఉంది. 2014లోస్టార్ ఇండియా నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత ప్రజాదరణ గల ఐదు హీరోల్లో ఆయన ఒకరిగా నిలిచారు.
రాజకీయాలకు వచ్చేసరికి పవన్ కల్యాణ్ అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గానీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను గానీ దాటలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే వచ్చింది. రెండు చోట్ల కూడా పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి ఆయన ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రజా సేవ పట్ల అనురక్తి, నిజాయితీ ఉంది. కానీ వెనకతట్టునే ఉండిపోయారు.
వర్తమాన రాజకీయాలు కేవలం ప్రజా మద్దతు మీద మాత్రమే ఆధారపడి లేవు. గతంలో లోకసత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ కూడా ప్రయోగం చేసి విఫలమయ్యారు. దాదాపుగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే లెక్క. జయప్రకాశ్ నారాయణ ఆదర్శాలు చాలా మంది యువకులను ఆకట్టుకున్నాయి. ఆయన వ్యక్తిత్వం పట్ల ఆరాధన కూడా పెంచుకున్నారు. కానీ ఎన్నికల రణరంగంలో ఆయన విఫలమయ్యారు. పవన్ కల్యాణ్ జయప్రకాశ్ నారాయణ వైఫల్యం నుంచి, ఆయన అనుభవం నుంచి కొన్ని విషయాలను తప్పకుండా ఇప్పటికైనా స్వీకరించాల్సే ఉంది.
పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం 2008లో జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యాం పార్టీకి అనుబంధ యువజన విభాగం యువరాజ్యం అధినేతగా ఆయన పనిచేశారు. ప్రజారాజ్యం కోసం విస్తృతంగా పర్యటించారు. ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయనకు విశేషమైన ప్రజాదరణ లబించింది. ఆయన ప్రచార సభలకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. కానీ ప్రజారాజ్యం పెద్దగా విజయం సాధించలేకపోయింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాలకు విరామం ఇచ్చారు.
ఆ తర్వాత 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ సిద్ధాంతాలను ఆయన ఇజం పేరు మీద విడుదల చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో బిజెపి, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు, నరేంద్ర మోడీలతో వేదికలు పంచుకున్నారు. వైఎస్ జగన్ ను ఓ వైపు, కాంగ్రెసు పార్టీని మరో వైపు ఎదుర్కున్నారు. ఆయన మాత్రం పోటీ చేయలేదు. పార్టీ తరఫున అభ్యర్థులను కూడా నిలుపలేదు. బిజెపి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి అధికారం వెనక పవన్ కల్యాణ్ పాత్ర కీలకమనేది అందరికీ తెలిసిన విషయమే
ఆ తర్వాత తాను పూర్తి కాలం రాజకీయాల్లోకి వస్తున్నట్లు 2017 డిసెంబర్ లో పవన్ కల్యాణ్ ప్రకటించారు. పలు సమస్యలను ముందుకు తెచ్చి, వాటిపై పోరాటాలు చేశారు ఉద్దానం కిడ్నీ సమస్యలపై పోరాటం ప్రధానమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని 2016లో ప్రకటించి, ఎన్నికల రణరంగంలోకి ఒంటరిగా దిగారు. రైతు సమస్యలపై పలు ప్రాంతాల్లో పర్యటింాచరు. రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ త ర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పవన్ కల్యాణ్ ఓటమికి ఆయన మాత్రమే కారణం కాదు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు చంద్రబాబుకు ఎదురు తిరిగాయి. ఆయన అమరావతి చుట్టూ, పోలవరం చుట్టూ తిరిగిన వైనం అందుకు ప్రధాన కారణం. కనీసం ఆ రెండింటిలో ఒకదాని విషయంలో కూడా చంద్రబాబు ఫలితం చూపించలేకపోయారు. మొత్తం రాష్ట్రాన్ని విస్మరించారనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు గెలుస్తాడేమోననే భయంతో ప్రజలు ఒక్కుమ్మడిగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓట్లేశారు. దానివల్ల పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి గండి పడింది.
దానికితోడు, వైఎస్ జగన్ అప్పటికే పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లి హామీల వర్షం కురిపిస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్ల వంటి కీలకమైన విషయాల్లో కూడా జగన్ ఏ మాత్రం జంకకుండా తన వైఖరిని వెల్లడించారు. దానివల్ల ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఏర్పడింది. కాపు రిజర్వేషన్లను తాను కల్పించలేనని చేసిన ప్రకటన జగన్ కు ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా పనిచేసిందనే చెప్పాలి.
ఇకపోతే, పవన్ కల్యాణ్ తాను ముఖ్యమంత్రిని అవుతానని, తన పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా ప్రజలకు చెప్పలేకపోయారు. జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసించలేకపోయారు. దాంతో ప్రజలు గెలుపు అవకాశాలుందని భావించిన పార్టీలకు మాత్రమే ఓట్లేస్తారు. సాధారణంగా ప్రజల మైండ్ సెట్ అలా ఉంటుంది. గెలుపు అవకాశాలు లేని పార్టీకి ఓటేయడానికి ప్రజలు ఇష్టపడలేదు. తాను అధికారంలోకి వచ్చి తీరుతాననే ధీమాను పవన్ కల్యాణ్ వ్యక్తం చేయలేకపోయారు. అది పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.
మరో ప్రధానమైన విషయం ఏమిటంటే... పార్లమెంటరీ రాజకీయాల్లో కేవలం ఆదర్శాలు ఏ పార్టీకి కూడా అధికారాన్ని కట్టబెట్టవు. వ్యూహాలు, ఎత్తుగడలు ప్రత్యర్థులను ఢీకొనడానికి ప్రధానంగా పనికి వస్తాయి. ఈ వ్యూహాలూ ఎత్తుగడలూ పవన్ కల్యాణ్ కు మామూలుగానే ఇష్టం లేదు. పవన్ కల్యాణ్ ఆదర్శాలు ఎంతగా ప్రజలకు నచ్చినప్పటికీ ఎన్నికల్లో మాత్రం పనిచేయలేదు. జయప్రకాశ్ నారాయణ విషయంలో జరిగింది ఇదే.
మరో ప్రధానమైన విషయం ఏమిటంటే... పవన్ కల్యాణ్ కుల ముద్రకు దూరంగా ఉండడానికే ప్రయత్నించారు. సహజంగానే ఆయన కుల ప్రస్తావన, కుల రాజకీయాలు దూరం. అయితే, పవన్ ఒక విధంగా తలిస్తే ప్రజలు మరో విధంగా తలిచారు. ఆయన విషయంలో కుల ముద్ర అసలు పోలేదు. కులాన్ని దాటి పవన్ కల్యాణ్ విషయంలో ప్రజలు ఆలోచించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కుల ప్రాధాన్యంతో నడుస్తున్నాయి. చంద్రబాబు ఒక సామాజిక వర్గానికి, జగన్ మరో సామాజిక వర్గానికి చెందినవారిగానే గుర్తింపు పొందారు. పవన్ కల్యాణ్ ను కూడా ఇంకో సామాజికవర్గం ప్రతినిధిగా చూశారు.
జయాపజయాల విషయంలో కీలకంగా మారే వర్గాలను పవన్ కల్యాణ్ ఆకట్టుకోలేకపోయారని చెప్పవచ్చు. ఇందులో ఏస్సీలు, బీసీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ వర్గాల మద్దతు ఉన్న పార్టీయే విజయం సాధిస్తుంది. ఈ వర్గాల మద్దతు తారుమారైనప్పుడల్లా పార్టీల విజయాలు తారుమారవుతాయి. అదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు.