- Home
- National
- World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
World Highest Railway Station : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ టంగులా గురించి తెలుసా? సముద్ర మట్టానికి 16,627 అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్టేషన్‌లో ఆక్సిజన్ మాస్కులు తప్పనిసరి. ఇక్కడ రైలు దిగడం ప్రాణాలకే ప్రమాదం. పూర్తి వివరాలు మీకోసం.

ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఎక్కడుంది?
సాధారణంగా మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటాం. కానీ, ఒక రైల్వే స్టేషన్‌లో మాత్రం రైలు దిగాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ గాలి పీల్చుకోవడం కూడా కష్టమే. విమానంలో ఉన్నట్లుగా ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు అవసరమయ్యే రైల్వే స్టేషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది కల్పితం కాదు, అక్షరాలా నిజం. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో, మేఘాలను తాకేలా నిర్మించిన ఈ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. అదే 'టంగులా రైల్వే స్టేషన్' (Tanggula Railway Station).
మేఘాల ఎత్తులో రైలు ప్రయాణం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్‌గా పేరుగాంచిన టంగులా రైల్వే స్టేషన్ టిబెట్‌లోని అమ్డో కౌంటీలో ఉంది. ఇది సముద్ర మట్టానికి ఏకంగా 5,068 మీటర్ల (16,627 అడుగుల) ఎత్తులో నిర్మించారు. ఇంత ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ రైలు ప్రయాణం ఆకాశంలో వెళ్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
ఈ స్టేషన్ కింఘై-టిబెట్ (Qinghai-Tibet) రైల్వే లైన్‌లో ఉంది. ఇది గోల్ముండ్‌ను టిబెట్ రాజధాని లాసాతో కలుపుతుంది. టిబెట్‌ను మిగిలిన చైనా ప్రాంతంతో అనుసంధానించిన మొట్టమొదటి రైలు మార్గం ఇదే కావడం విశేషం. దీనిని 'డాంగ్లా రైల్వే స్టేషన్' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం నుంచి వెళ్లేటప్పుడు ప్రయాణికులకు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిదని పర్యాటకులు పేర్కొంటారు.
విమానం తరహాలో రైలులో ఆక్సిజన్ మాస్కులు
సాధారణంగా విమానాల్లో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి ఎమర్జెన్సీ కోసం ఆక్సిజన్ మాస్కులు అందుబాటులో ఉంచుతారు. కానీ, ఈ రైలు మార్గంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. టంగులాస్టేషన్ అత్యంత ఎత్తులో ఉండటం వల్ల అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విమానాల్లో ఉన్నట్లే, ఇక్కడి రైళ్లలో కూడా ప్రతి సీటు దగ్గర ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు అందుబాటులో ఉంటాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ఈ జాగ్రత్తలు తీసుకుంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక సాహసంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు.
సిబ్బంది లేని ఆటోమేటిక్ రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ రైల్వే సిబ్బంది ఎవరూ ఉండరు. ఇంత ఎత్తులో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మనుషులు విధులు నిర్వహించడం చాలా కష్టం. అందుకే ఈ స్టేషన్‌ను పూర్తిగా ఆటోమేటిక్ వ్యవస్థతో నడిపిస్తున్నారు. రైళ్ల రాకపోకల నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ వరకు అన్నీ యంత్రాలే చూసుకుంటాయి. జూలై 1, 2006న ప్రారంభమైన ఈ స్టేషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించుకుంది.
ఈ స్టేషన్ మొత్తం పొడవు 1.25 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మొత్తం మూడు ట్రాక్‌లు ఉన్నాయి. ఒకటి ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుండగా, మధ్యలో ఉన్న ట్రాక్‌ను రైళ్లు నిలపడానికి లేదా మార్చడానికి, మూడవ ట్రాక్‌ను చిన్న ప్లాట్‌ఫారమ్ కోసం ఉపయోగిస్తారు.
రైలు ఆగుతుంది.. కానీ దిగకూడదు !
2010కి ముందు వరకు ఈ స్టేషన్‌లో ప్యాసింజర్ రైళ్లు ఆగేవి కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు ఆగుతున్నాయి. అయితే, ఇది కేవలం టెక్నికల్ హాల్ట్ అంటే సాంకేతిక కారణాల వల్ల ఆగే స్టాప్ మాత్రమే. అధికారికంగా ప్రయాణికులు ఇక్కడ ఎక్కడానికి గానీ, దిగడానికి గానీ అనుమతి ఉండదు. స్టేషన్ చాలా ఎత్తులో ఉండటం వల్ల ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ రైలు దిగడం లేదా ఎక్కడం నిషేధమని సమాచారం. రైలు ఆగినప్పుడు ప్రయాణికులు కిటికీల గుండా బయట ఉన్న అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణుల దృశ్యాలను వీక్షించవచ్చు.
భారత్‌లో ఎత్తైన రైల్వే స్టేషన్ ఏది?
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్ చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉంటే, మన భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పరిధిలోని ఘూమ్ (Ghum) రైల్వే స్టేషన్ భారత్‌లోనే అత్యంత ఎత్తులో ఉన్న స్టేషన్‌గా రికార్డు కలిగి ఉంది.
ఇది సముద్ర మట్టానికి 2,258 మీటర్ల (7,407 అడుగుల) ఎత్తులో ఉంది. టంగులాస్టేషన్‌తో పోలిస్తే దీని ఎత్తు తక్కువే అయినప్పటికీ, పర్యాటక పరంగా ఘూమ్ స్టేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడి టాయ్ ట్రైన్ ప్రయాణం పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది.

