హైదరాబాద్ మరో భోపాల్ కానుందా? పాశమైలారం ప్రమాదం ఏం చెబుతోంది?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ప్రమాదం ఎంతటి విషాధాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంఘటన ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. దేశం పారిశ్రామికంగా దూసుకెళ్తోందని సంతోషించాలా.?

అప్రమత్తతే కారణమా.?
జూన్ 30వ తేదీన జరిగిన సిగాచీ ప్రమాదంలో ఇప్పటికే 40 మంది మరణించినట్లు గుర్తించగా మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దీంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో పరిశ్రమల భద్రతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తిందీ సంఘటన.
సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో చోటుచేసుకున్న బ్లాస్ట్‌లో ఒకే సారి భవనం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో శరీర భాగాలు దూరంగా పడిపోయాయంటేనే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఇది కూడా భోపాల్ గ్యాస్ లీక్ విధంగా, అప్రమత్తత లేకపోవడం వల్లే జరిగిందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
రోజుకు ముగ్గురు కూలీలు చనిపోతున్నారు
భారతదేశంలో ఫ్యాక్టరీలలో జరిగే ప్రమాదాల గణాంకాలు భయాందోళన కలిగించేవిగా ఉన్నాయి. 2017-2020 మధ్య కాలంలో ప్రతి రోజు 3 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏడాది సగటున 1,100 పైగా మరణాలు నమోదయ్యాయి.
ఒక్క గుజరాత్‌లో 2019లో 79 మరణాలు, 192 గాయాలయ్యాయి. ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీలలోనే జరిగాయి. NDMA ప్రకారం, గత దశాబ్దంలో 130 పెద్ద కెమికల్ ప్రమాదాలు, 259 మరణాలు, 563 తీవ్ర గాయాలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 3.5 లక్షల కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.
ప్రమాదాలకి అసలు కారణం ఏంటి?
భారతదేశంలోని పరిశ్రమలలో ప్రమాదాల్లో అధికంగా మానవ తప్పిదాలు, పాత యంత్రాలు, సరైన శిక్షణ లేకపోవడం వల్ల జరుగుతుంటాయి. కానీ ఇవి పైకి కనిపించే కారణాలు మాత్రమే. అసలు సమస్య మాత్రం ప్రణాళికా లోపాలు, నిర్వీర్యమైన చట్టాలు, నిర్వహణలో నిర్లక్ష్యం అనేవే వాస్తవాలు.
పాశమైలారం ప్రమాదం ఎలా జరిగింది.?
40 మందికి పైగా పొట్టనపెట్టుకున్న సిగాచీ ప్రమాదం AHU (ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్)లో చోకింగ్ వల్ల పేలుడు వల్ల జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే భద్రతా పరికరాలు నాణ్యతలేమి, శిక్షణ లోపం, ఫీటీగ్‌డ్ మిషిన్లను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కేవలం చిన్న ఉద్యోగులే బాధితులు అవుతున్నారా.?
భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనను దేశం అంత సులభంగా మర్చిపోదు. ఈ ప్రమాదంలో ఎంతో అమాయక ప్రజలు మరణించారు. భోపాల్ గ్యాస్ లీక్ సమయంలో యూనియన్ కార్బైడ్ CEO వారెన్ అండర్సన్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. పాశమైలారం విషయంలో కూడా తొలుత మేనేజ్‌మెంట్ మౌనంగా ఉంది. అయితే ఒత్తిడి పెరగడంతో ఒక ప్రకటన చేశారు.
అయితే ఇలాంటి ప్రమాదాల్లో చిన్న ఉద్యోగులే బాధితులుగా మారుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అలాగే సంస్థలపై కేసులు నమోదైనా శిక్షలు మాత్రం అరుదుగా జరుగుతున్నాయి. నేరవారిన వారిపై కేసులు నమోదు అయినా, శిక్షలు మాత్రం అరుదుగా జరుగుతున్నాయి. గుజరాత్‌లో నేరం నిరూపైన కేసులు కేవలం 6.95 శాతం ఉండగా, మహారాష్ట్రాలో 13.84%, తమిళనాడులో:14.45%గా ఉంది.
చట్టాలున్నాయిగానీ... అమలు కావడం లేదా.?
ప్రస్తుతం భారత్‌లో ఫ్యాక్టరీల భద్రత Factories Act, 1948 ఆధారంగా అమలవుతుంది. కానీ ఇది చాలా పాత విధానం. ఇది పెనాల్టీ ఆధారిత చట్టం, జాగ్రత్తలపై కాకుండా ఉల్లంఘనలపై ఆధారపడుతుంది.
పరిశ్రమలపై ఇన్‌స్పెక్షన్లు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఈ చట్టం ప్రకారం వర్కర్లకు ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. హాజర్డస్ మెటీరియల్స్‌కి క్లియర్ డెఫినిషన్ లేదు, దీంతో కంపెనీలు తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి.
ఎలా నివారించాలి ?
భవిష్యత్తులో మరో భోపాల్ గ్యాస్ లీక్‌లాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైనవి.
* పారదర్శక పరిశ్రమ భద్రతా చట్టాలు తీసుకురావాలి. ఫ్యాక్టరీ యాజమాన్యంపై స్పష్టమైన బాధ్యత ఉండాలి. మేనేజ్మెంట్ తప్పించుకోలేని విధంగా కఠినమైన నిబంధనలు అవసరం.
* AHU లాంటి కీలక వ్యవస్థలకు పర్మనెంట్ ఇన్స్పెక్షన్ మెకానిజం అవసరం. ప్రతి ఫార్మా కంపెనీకి తప్పనిసరిగా టెక్నికల్ ఇన్‌స్పెక్టర్‌లు ఉండాలి.
* ప్రతి కార్మికుడికీ ఆరోగ్య, ప్రాణ భద్రతా ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది వృద్ధి చెందుతున్న ఇండస్ట్రియల్ దేశానికి తప్పనిసరికావాలి.
ఎక్స్‌గ్రేషియా మాత్రమే కాదు.
* ప్రమాద నివారణపై ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఉండాలి. NDMA వంటి సంస్థలు కేవలం స్పందన (response) కాకుండా, ప్రివెన్షన్ పై కేంద్రీకరించాలి.
* ప్రమాదం జరిగిన తర్వాత "ఎక్స్‌గ్రేషియా" అనే పేరు మీద కొన్ని లక్షల చెల్లింపులు, ఆ తర్వాత కొన్ని రోజులకు మర్చిపోవడం జరుగుతుంది. అయితే మరణించిన కార్మికుడి కుటుంబానికి ఆ లోటు ఎప్పటికీ తీర్చలేనిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అంతేకాదు, వారి పిల్లల భవిష్యత్తు, కుటుంబ జీవనోపాధి మొత్తం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ప్రతి సంఘటన తర్వాత అధికారిక ప్రకటనలు, బాధితుల ఆవేదన, తరువాత మళ్లీ మౌనం... ఇదే తంతు నడుస్తోంది.