Hyderabad: హైదరాబాదీలకు పండగలాంటి వార్త.. 4 కొత్త స్కైవాక్‌లు, ఎక్కడెక్కడంటే
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగానే ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. బాటసారులు రోడ్డు దాటాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే నగరంలో 4 కొత్త స్కైవాక్‌లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హైదరాబాద్‌లో కొత్త స్కైవాక్‌లు
హైదరాబాద్‌లో పాదచారుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సురక్షితంగా వెళ్లేలా నాలుగు కొత్త స్కైవాక్‌లను నిర్మించనున్నట్లు హెచ్ఎండీఏ కమీషనర్ అహ్మద్ వెల్లడించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రో ఈస్ట్ - వెస్ట్ స్టేషన్లు, రేతీఫైల్, కీస్ హైస్కూల్ బస్టాప్ మధ్య ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని స్కైవాక్ డిజైన్ చేశారు.
అలాగే, కూకట్‌పల్లి జేఎన్టీయూ నుంచి మెట్రో స్టేషన్ వరకూ, అలాగే ప్రగతినగర్ దిశగా వెళ్లే మార్గంలో స్కైవాక్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రజల సౌకర్యం కోసం ఈ ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఉప్పల్ జంక్షన్‌లో
ఉప్పల్ జంక్షన్ వద్ద ఉప్పల్ వెళ్లే మార్గంలో స్కైవాక్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన హెచ్ఎండీఏ.. అక్కడ స్మశానవాటిక ఉండటం వల్ల ఇంతకాలం స్కైవాక్ నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడ కూడా స్కైవాక్ నిర్మించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు అహ్మద్ తెలిపారు.
మెహిదీపట్నం స్కైవాక్ ఆగస్టు 15న ప్రారంభం
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెహిదీపట్నం స్కైవాక్‌ను ఆగస్టు 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని హెచ్ఎండీఏ తెలిపింది. ఈ స్కైవాక్ ప్రారంభంతో అక్కడి ట్రాఫిక్, పాదచారుల రద్దీకి సమర్థవంతమైన పరిష్కారం లభించనుంది.
ఆదాయ వనరుల పెంపుకోసం కొత్త లేఅవుట్లు
హెచ్ఎండీఏ ఆధీనంలో కంది, ఫసల్ వాడీ, పెద్ద కంజర్ల ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ లేఅవుట్లు అభివృద్ధి చేయడం ద్వారా హెచ్ఎండీఏ ఆదాయాన్ని పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను సేకరించి పెద్ద లేఅవుట్లు రూపొందించాలన్నదే ప్రస్తుత ఆలోచన.
మాస్టర్ ప్లాన్-2050 దిశగా అడుగులు
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 ప్రకారం, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఎకానమిక్ డెవలప్మెంట్ ప్లాన్, బ్లూ, గ్రీన్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ప్లాన్ పనులు కొనసాగుతున్నాయి. 2026 మే నాటికి ఈ ప్రణాళికను పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇకపోతే, HMDA పరిధిలోని భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లకు సంబంధించిన ఫైళ్ల పెండింగ్ విషయంపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అహ్మద్ తెలిపారు. అలాగే నగరంలోని పర్యావరణాన్ని మెరుగుపరచేందుకు 19 కొత్త పార్కులకు స్థలాలను గుర్తించామని ఆయన వెల్లడించారు.