- Home
- National
- High Alert: దేశ వ్యాప్తంగా హై అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక
High Alert: దేశ వ్యాప్తంగా హై అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక
ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. దేశంలోని విమానాశ్రయాలను టార్గెట్ చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారం అందింది. వివరాల్లోకి వెళితే..

హై అలర్ట్
దేశంలోని అన్ని విమానాశ్రయాల భద్రతపై నిఘా వర్గాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేయడంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో (BCAS) తక్షణ చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉందన్న సమాచారం నేపథ్యంలో ఆగస్టు 4న ప్రత్యేక అడ్వైజరీలు జారీ చేసింది.
భద్రతా చర్యలు కట్టుదిట్టం
అన్ని విమానాశ్రయాల టెర్మినల్స్, పార్కింగ్ ప్రాంతాలు, పెరిఫెరల్ జోన్లలో 24 గంటలూ పెట్రోలింగ్ కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎయిర్‌స్ట్రిప్స్, హెలిప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూళ్లు, శిక్షణ కేంద్రాల్లో కూడా భద్రతను బలోపేతం చేయాలని సూచించింది. స్థానిక పోలీసుల సమన్వయంతో సిటీసైడ్ సెక్యూరిటీ చర్యలు చేపట్టాలని BCAS స్పష్టం చేసింది.
సోదాలు, తనిఖీలు మరింత కఠినం
అంతర్జాతీయ, దేశీయ మార్గాల ద్వారా పంపే మెయిల్ పార్సిళ్లను పూర్తిగా సోదా చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లు అందరికీ కఠిన తనిఖీలు తప్పనిసరి చేయాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు.
సీసీటీవీ నిఘా
ప్రతి విమానాశ్రయంలో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాల పనితీరును సమీక్షించి, అవసరమైతే వెంటనే యాక్టివేట్ చేయాలని సూచించారు. అన్ని ప్రోటోకాల్స్‌ను పునఃపరిశీలించి అమలు చేయాలని పేర్కొన్నారు.
ప్రత్యేక కమిటీ సమావేశాలు తప్పనిసరి
విమానాశ్రయ డైరెక్టర్లు స్పెషల్ ఎయిర్‌లైన్ పాసింజర్ సర్వీస్ కమిటీ సమావేశాలను తక్షణం నిర్వహించాలని BCAS ఆదేశించింది. భద్రతా లోపాలు, సమన్వయం, అత్యవసర చర్యలపై ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

