- Home
- National
- పాము కాటుతో మరణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
పాము కాటుతో మరణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
Crime News: సమాజంలో విలువలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. డబ్బు కోసం కొందరు ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. తాజాగా తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన యావత్ సమాజాన్ని షాక్‌కి గురి చేసింది.

కన్నతండ్రిపైనే కుమారుల కుట్ర
డబ్బు ఆశ మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూపించే భయానక ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. భారీ ఇన్సూరెన్స్ సొమ్ము పొందాలనే ఉద్దేశంతో ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రినే పాము కాటుతో చంపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మొదట ఇది సహజ మరణంలా కనిపించినా దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.
ప్రభుత్వ ఉద్యోగి గణేశన్ అనుమానాస్పద మృతి
తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేశన్ (56) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ నెలలో ఆయన పాము కాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ ఘటనపై పెద్దగా ఎలాంటి సందేహాలు రాలేదు.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ దగ్గరే మొదలైన అనుమానాలు
గణేశన్ పేరుపై తీసుకున్న దాదాపు రూ.3 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్ కోసం అతడి ఇద్దరు కుమారులు ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించారు. ఒక సాధారణ ఉద్యోగి పేరిట ఇంత పెద్ద మొత్తంలో పాలసీలు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. దానికితోడు కుమారుల ప్రవర్తన కూడా అనుమానంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
విచారణలో షాకింగ్ నిజాలు
పోలీసుల లోతైన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. తండ్రి పేరుపై ముందుగానే భారీ ఇన్సూరెన్స్ చేయించిన కుమారులు ఆయన మృతిని ప్రమాదంలా చూపించేందుకు పథకం రచించారు. మృతి జరిగే వారం ముందే ఒకసారి పాము ద్వారా దాడి చేయించారు. ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత మరోసారి అత్యంత విషపూరితమైన పామును తెచ్చి గణేశన్ నిద్రలో ఉండగా మెడపై కాటు వేయించారు. ఘటన సహజంగా కనిపించేందుకు పామును అక్కడే చంపేశారు.
కావాలనే ఆలస్యం చేశారు
గణేశన్‌ను ఆస్పత్రికి తరలించడంలో కావాలనే ఆలస్యం చేశారని పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో కుమారులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కేసులో ఇద్దరు కుమారులు సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెర తీసింది.

