- Home
- National
- Ahmedabad plane crash: ఇన్ని ప్రత్యేకతలున్న విమానం ఇలా ఎలా.? బోయింగ్ భద్రతపై అనుమానాలు
Ahmedabad plane crash: ఇన్ని ప్రత్యేకతలున్న విమానం ఇలా ఎలా.? బోయింగ్ భద్రతపై అనుమానాలు
దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం, ఏకంగా 200 మందికి పైగా మరణించిన ఆకాశమంతా విషాదం. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రత అంశంపై చర్చ మొదలైంది.

ఇలాంటి ప్రమాదం ఇదే తొలిసారి.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్‌కు చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం ప్రయాణమధ్యలోనే కుప్పకూలింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో విమాన తయారీ సంస్థ బోయింగ్‌పై భద్రతా అంశాలపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ మోడల్ విమానాల్లో సాంకేతిక లోపాలు నమోదవుతున్నా.. కుప్పకూలిన మొదటి ఘటన ఇదే.
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విశేషాలు
బోయింగ్ కంపెనీ రూపొందించిన 787-8 డ్రీమ్‌లైనర్ మిడియం సైజ్ వైడ్‌బాడీ విమానంగా చెబుతుంటారు. ఇది 2011లో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ విమానం నాన్‌స్టాప్‌గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కన్ఫిగరేషన్‌ను బట్టి ఇందులో 242 నుంచి 290 మందివరకు ప్రయాణించవచ్చు. ముఖ్యమైన నగరాల మధ్య లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్‌కు ఈ మోడల్ చాలా ప్రాచుర్యం పొందింది.
తక్కువ ఇంధన వినియోగం
డ్రీమ్‌లైనర్ బాడీని 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. ఇది అల్యూమినియం కంటే తేలికగా ఉండి, స్టీల్ కన్నా బలంగా ఉంటుంది. దీని వల్ల విమానం తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు.
గతంలోనూ సమస్యలు
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో గతంలో కూడా ఎన్నో సాంకేతిక లోపాలు నమోదయ్యాయి. ముఖ్యంగా హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ ఫెయిల్యూర్ వంటి సమస్యల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు జరిగాయి. బోయింగ్‌కు చెందిన మాజీ ఇంజినీర్ సామ్ సలేపూర్ గతంలో మీడియా ఇంటర్వ్యూలో ఈ మోడళ్ల తయారీలో నాణ్యత లోపాలు ఉన్నాయని ఆరోపించారు. దీర్ఘకాలంలో ఇవి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రమాదం తర్వాత షేర్ల పతనం
ఈ విమాన ప్రమాద ఘటన తర్వాత బోయింగ్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ప్రీ-మార్కెట్‌లో బోయింగ్ షేర్లు ఒక్కసారిగా 8 శాతం మేర పడిపోయాయి. సంస్థపై ఉన్న ఆరోపణలపై నిజనిజాల వెలుగులోకి రావడానికి పూర్తి దర్యాప్తు అవసరం. దీనివల్ల భవిష్యత్తులో బోయింగ్ విమానాలపై వినియోగదారుల విశ్వాసం ఎంతమేరకు నిలబడుతుందో వేచి చూడాలి.