ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
Hospital Bill Fraud : ఆసుపత్రిలో ఐటమైజ్డ్ బిల్లు అడగడంతో రూ. 1 లక్ష బిల్లు కాస్తా రూ. 57 వేలకు తగ్గింది. బిల్లింగ్ మోసాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆసుపత్రిలో బిల్లు కట్టే ముందు జాగ్రత్త.. ఒక్క ప్రశ్నతో రూ. 44 వేలు ఆదా చేసిన పేషెంట్
ప్రస్తుతం వైద్యం చాలా ఖరీదైనదిగా మారింది. చిన్నపాటి చికిత్సకైనా ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. అయితే, ఆసుపత్రులు వేసే ఈ బిల్లుల వెనుక భారీ అక్రమాలు జరుగుతున్నాయని తాజాగా ఒక ఘటన నిరూపించింది. ఒక పేషెంట్ తనకు వచ్చిన రూ. 1 లక్ష బిల్లును కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో రూ. 57,000 కు తగ్గించుకున్న వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఒక్క బిల్లు అడిగితే రూ. 44 వేల లాభం
జనవరి నెలలో ఒక ప్రాంతీయ ఆసుపత్రిలో ఒక వ్యక్తి అవుట్ పేషెంట్ విధానంలో ఒక చిన్న వైద్య ప్రక్రియ చేయించుకున్నారు. ఇన్సూరెన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆసుపత్రి యాజమాన్యం అతనికి రూ. 1,00,000 బిల్లు చేతిలో పెట్టింది. అంత పెద్ద మొత్తాన్ని చూసి మొదట కంగారు పడ్డ సదరు వ్యక్తి, దాన్ని ఎలాగోలా చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తన సహోద్యోగి ఇచ్చిన సలహాతో అతను ఆసుపత్రిని ఐటమైజ్డ్ బిల్లు (Itemised Bill) ఇవ్వాలని కోరాడు. అంటే ప్రతి ఖర్చును విడివిడిగా వివరించే పూర్తి స్థాయి రశీదు అన్నమాట.
చేయని సర్జరీకి.. వాడని మందులకు బిల్లులు
ఆసుపత్రి పంపిన ఆరు పేజీల సుదీర్ఘ బిల్లును పరిశీలించిన ఆ వ్యక్తికి దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. తనకు అసలు జరగని అనస్థీషియా కన్సల్టేషన్ కోసం రూ. 31,430 ఛార్జీ వేసినట్లు గుర్తించాడు. అంతేకాకుండా, ఒకే సప్లై కిట్ కు రెండుసార్లు బిల్లు వేసినట్లు గమనించాడు. తాను పొందని సేవలకు కూడా బిల్లులో భారీ మొత్తాలను చేర్చడం చూసి అతను వెంటనే బిల్లింగ్ విభాగాన్ని సంప్రదించాడు. ఆశ్చర్యకరంగా, బిల్లింగ్ విభాగం వారు ఎటువంటి వాదనకు దిగకుండానే, ఆ తప్పులను సరిచూస్తామని ఒప్పుకున్నారు.
రెండు వారాల్లో మారిన బిల్లు చిత్రం
బాధితుడు ఫిర్యాదు చేసిన రెండు వారాల తర్వాత, ఆసుపత్రి తన పొరపాటును అంగీకరిస్తూ సవరించిన బిల్లును పంపింది. అనస్థీషియా, డూప్లికేట్ ఛార్జీలను తొలగించడంతో రూ. 1 లక్ష ఉన్న బిల్లు కాస్తా రూ. 57,000 కు తగ్గిపోయింది. అంటే కేవలం ఒక ఐటమైజ్డ్ బిల్లు అడిగి, తప్పులను ఎత్తి చూపడం వల్ల ఆ పేషెంట్ కు రూ. 44,000 ఆదా అయ్యింది. మిగిలిన మొత్తాన్ని అతను సులభంగా చెల్లించి, ఈ విషయాన్ని ఇతరులకు హెచ్చరికగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఆసుపత్రుల డార్క్ పాటర్న్స్ పై ప్రజల ఆగ్రహం
ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆసుపత్రుల తీరుపై మండిపడుతున్నారు. ఇది పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా చేసే మోసం అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆసుపత్రులు ఇలాంటి డార్క్ పాటర్న్స్ పాటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "మీరు ఐటమైజ్డ్ బిల్లు అడిగితే చాలు, కనీసం 20 శాతం బిల్లు తగ్గుతుంది" అని ఒకరు కామెంట్ చేయగా, "ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి మోసాలను పట్టించుకోవు, ప్రీమియంలు మాత్రం పెంచుతాయి" అని మరొకరు విమర్శించారు.
asked for an itemized hospital bill on a whim and found out they charged me for stuff that literally never happened
by u/LongjumpingOffice432 in povertyfinance

