రాఖీ కట్టేటప్పుడు ఈ ఒక్క మంత్రం చెప్పండి.. మీ అన్నదమ్ములకు అంతా మంచే జరుగుతుంది
రాఖీ పండుగనాడు అక్కా చెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రం చెబితే ఎంతో మంచిది. ఆ పవర్ ఫుల్ మంత్రం గురించి ఇక్కడ ఇచ్చాము. దీన్ని చదువుతూ రాఖీ కట్టడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయో తెలుసుకోండి.

రాఖీ పండుగ ప్రత్యేకత
రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమకు గుర్తుగా వచ్చే ప్రత్యేకమైన రోజు. ఈ రోజు అక్క లేదా చెల్లి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరిని జీవితాంతం కాపాడతానని మాట ఇస్తాడు. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28న నిర్వహించుకోనున్నాము. రాఖీ కట్టే సమయంలో కొన్ని సంప్రదాయాలను పాటిస్తే అన్నాదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు శుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అందులో ముఖ్యమైనది రాఖీ కడుతున్నప్పుడు ఒక ప్రత్యేక మంత్రాన్ని చెప్పాలి. ఈ మంత్రం సోదరుడి రక్షణ, సుఖసంతోషాలు, మంచి జీవితం కోసం చెప్పే ప్రార్థనగా భావిస్తారు.
రాఖీ కట్టేటప్పుడు చెప్పాల్సిన మంత్రం
యేన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః..
తేన త్వామనుబధ్నామి రక్షే మా చల మా చల..
రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రం చెబితే మంచిది. ఈ మంత్రానికి ఒక పౌరాణిక కథతో సంబంధం ఉందని చెబుతారు. పురాణాల్లో మహాబలుడు, దానశీలి అయిన రాజు బలి గురించి ప్రస్తావన ఉంటుంది. ఒకప్పుడు రాజు బలిని రక్షాసూత్రంతో కట్టారని, అదే రక్షాసూత్రం పేరుతో ఈ మంత్రాన్ని రాఖీ సమయంలో చెబుతారని నమ్మకం. దీని సులభమైన అర్థం.. “ఎంతో శక్తివంతుడైన రాజు బలికి కట్టిన రక్షాసూత్రంతోనే నిన్ను కూడా కడుతున్నాను. ఓ రక్షాసూత్రమా.. నువ్వు ఎప్పుడూ స్థిరంగా ఉండి రక్షణ ఇవ్వాలి” అని. అందుకే రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పడం శుభంగా భావిస్తారు.
రాఖీ ఇలా కట్టండి
రాఖీ కట్టడానికి ముందు కావాల్సిన వస్తువులను ఒక థాలీలో పెట్టుకోవాలి. అందులో రాఖీ, కుంకుమ, బియ్యం, దీపం, స్వీట్లు పెట్టుకోవాలి. సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోబెట్టి, ముందుగా నుదుటిపై కుంకుమ, బియ్యంతో తిలకం పెట్టాలి. ఆ తర్వాత కుడి చేతికి రాఖీ కడుతూ పై మంత్రాన్ని చెప్పాలి. రాఖీ కట్టిన తర్వాత హారతి ఇచ్చి, స్వీట్ తినిపించి, అతడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకోవచ్చు. సోదరుడు కూడా తన సోదరికి తనకు చేతనైన బహుమతి ఇచ్చి ప్రేమను చూపించాలి.

