Moringa Powder: మునగాకు పొడితో ఊహించని లాభాలు.. ఈ సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు!
మన చుట్టూ లభించే కొన్ని సహజ పదార్థాలు ఆరోగ్యానికి అమృతం లాంటివి. అలాంటి వాటిలో మునగాకు పొడి ఒకటి. ఈ పొడిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు లభించడమే కాదు అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మునగాకు పొడి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో చాలామంది సహజ ఫుడ్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలా ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్ లో మునగాకు పొడి ఒకటి. మునగ ఆకులను ఎండబెట్టి తయారు చేసే ఈ పొడి.. పోషకాలు, ఔషధాల గని. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో పాటు, అనేక వ్యాధులను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో మునగాకు పొడిని చేర్చుకోవడం ద్వారా చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
షుగర్ లెవల్స్
నిపుణుల ప్రకారం ఆహారంలో మునగాకు పొడిని చేర్చుకుంటే బ్లెడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారిలో మునగాకు పొడి బ్లెడ్ గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
అధిక కొలెస్ట్రాల్
అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణం. మునగాకు పొడిలో ఉండే ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి
మునగాకు పొడిలో విటమిన్ సి, బీటా కెరోటిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బాగా సహాయపడతాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా మునగాకు పొడి ఎంతో మంచిది. విటమిన్ A సమృద్ధిగా ఉండటంతో కంటి చూపు మెరుగుపడుతుంది.
చర్మ ఆరోగ్యం
మునగాకు పొడి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. మొటిమలు, చర్మ దద్దుర్లు వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. జుట్టు రాలిపోవడం తగ్గించి, జుట్టు బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడానికి..
మునగాకు పొడిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. ఇది జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. నీళ్లలో లేదా స్మూతీలలో మునగాకు పొడిని కలుపుకొని తాగితే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మునగాకు పొడిలో కాల్షియం, ఫాస్పరస్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడంతో పాటు, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
ఇది గుర్తుంచుకోండి
మునగాకు పొడిని సరైన పరిమాణంలో (రోజుకు 2-5 గ్రాములు) తీసుకోవడం మంచిది. అధికంగా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. గర్భిణీలు లేదా ఏవైనా మందులు వాడేవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

