- Home
- Life
- Health
- Sleeping Disorder: 5 గంటలకన్నా తక్కువ నిద్రపోతున్నారా? మీ ఆయుష్షు ఎంత తగ్గుతుందో తెలుసా?
Sleeping Disorder: 5 గంటలకన్నా తక్కువ నిద్రపోతున్నారా? మీ ఆయుష్షు ఎంత తగ్గుతుందో తెలుసా?
Sleeping Disorder: మన శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. అయితే.. కొంతమందికి తమ బిజీ లైఫ్‌స్టైల్ లేదా అలవాట్ల వల్ల సరిగ్గా నిద్ర పోలేకపోతున్నారు. అలాంటి వారు ఆయుష్షు తగ్గుతుందని, వారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిద్ర కొద్దీ ఆయుష్షు
పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, డిజిటల్ పరికరాల వాడకం, మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. తక్కువగా నిద్రపోవడం లేదా నిద్రలేమి వల్ల ఆయుష్షు గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ నిద్ర వల్ల ఆయుష్షు ఎంత తగ్గుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, నిద్రలేమి వల్ల వచ్చే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.
నిద్రలేమి వల్ల దుష్పరిణామాలు
నిద్ర సరిగ్గా లేనివారికి క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి రోగనిరోధక శక్తిని దెబ్బతిని, క్యాన్సర్ కణాలు పెరుగుతాయంట. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. డిప్రెషన్, చిరాకు వంటివి వచ్చి ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతాయి. తక్కువ నిద్రపోయేవారికి నిర్ణయాలు తీసుకునే శక్తి, ఏకాగ్రత తగ్గుతాయి.గాఢనిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. నిద్రలేమి జ్ఞాపకశక్తి సమస్యలకు, మెదడు అలసటకు దారితీస్తుంది.
వారిని అకాల మృత్యువు వెంబడిస్తోంది
ఇవి కాకుండా దీర్ఘకాలిక తలనొప్పి, శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారిని అకాల మృత్యువు వెంబడిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. మంచి నిద్ర అలవాట్లు ఉన్నవారికి ఆ కారణంగా మరణించే ముప్పు 30% తక్కువగా, గుండె జబ్బులతో మరణించే ముప్పు 21% తక్కువగా ఉందని తేలింది. ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారికి మరణ ముప్పు 15% వరకు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో 9 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవారికి కూడా మరణ ముప్పు పెరుగుతుందని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్రలేమి వల్ల ఎంత ఆయుష్షు తగ్గుతుంది ?
నిద్రలేమి వల్ల ఎంత ఆయుష్షు తగ్గుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇది వ్యక్తి ఆరోగ్యం, జీవనశైలి, నిద్రలేమి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర అలవాట్లు ఉన్న పురుషులు సగటున 4.7 సంవత్సరాలు ఎక్కువగా, స్త్రీలు 2.4 సంవత్సరాలు ఎక్కువగా జీవించగలరని ఒక అధ్యయనం కనుగొంది. తక్కువ నిద్ర ఆయుష్షును ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ఒక అంశం. ఇది అనేక వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు దారితీసి జీవన నాణ్యతను, ఆయుష్షును తగ్గిస్తుంది. కాబట్టి సరైన నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి, దీర్ఘాయుష్షుకూ దారితీస్తుంది.