Low Blood Pressure: లో బీపీ సమస్య గుండెకు ప్రమాదకరమా ?
Low Blood Pressure : ఎక్కువ రక్తపోటే కాదు. తక్కువగా రక్తపోటు కూడా ప్రమాదకరమే. బీపీ తక్కువగా ఉన్న వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందట. ఇందులో నిజమేంత? గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

తక్కువ రక్తపోటు అంటే ఏమిటి?
రక్తపోటు అనేది గుండె శరీరానికి రక్తాన్ని పంపే సమయంలో రక్తనాళాల గోడలపై పడే ఒత్తిడి. సాధారణంగా ఇది 120/80 mmHgగా ఉండాలి. అయితే 90/60 mmHg కంటే తక్కువగా ఉన్నట్లయితే, దాన్ని తక్కువ రక్తపోటు (Low BP లేదా హైపోటెన్షన్)గా పరిగణిస్తారు. కొంతమందిలో ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా.. మరికొందరిలో మైకము, తలతిరుగుట, అలసట, మూర్ఛ రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తక్కువ రక్తపోటుకు కారణాలు
శరీరంలో తగినంత నీరు లేకపోతే ద్రవాల కొరత ఏర్పడి రక్తపోటు తగ్గవచ్చు. ప్రమాదం లేదా అంతర్గత రక్తస్రావం వల్ల ఎక్కువ రక్తం కోల్పోతే కూడా రక్తపోటు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాగే, కొంతమంది ఉపయోగించే హై బీపీ మందులు, గుండె సంబంధిత మందులు లేదా డిప్రెషన్‌కు సంబంధించిన మందులు రక్తపోటును తగ్గించవచ్చు. ఆరోగ్యపరంగా థైరాయిడ్ గ్రంథిలోని సమస్యలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు (సెప్సిస్), గుండె సంబంధిత సమస్యలు లేదా అడ్రినల్ గ్రంథి పనిచేయకపోవడం వంటి పరిస్థితులు కూడా బీపీని తగ్గించవచ్చు.
గుండెపోటు, లో బీపీ కి సంబంధం ఏమిటి?
తక్కువ రక్తపోటు ( లో బీపీ) నేరుగా గుండెపోటుకు కారణం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తపోటు చాలా తక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత రక్తం, ఆక్సిజన్ చేరకపోవచ్చు. దీంతో గుండె కండరాలకు ఆక్సిజన్ లోపం ఏర్పడి, అవి దెబ్బతిని గుండెపోటు (హార్ట్ అటాక్) సంభవించే అవకాశముంటుంది. ఇది ముఖ్యంగా ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి చాలా ప్రమాదకరం, ఎందుకంటే లో బీపీ లో వారి గుండె మరింత ఒత్తిడికి గురవుతుంది. అందుకే లో బీపీని కూడా తేలికగా తీసుకోకూడదు.
ప్రమాదకర పరిస్థితులు
సాధారణంగా, ఎవరికైనా ఎలాంటి లక్షణాలు లేకుండానే తక్కువ రక్తపోటు ఉంటే అది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, మైకం, తలతిరగడం, అలసట, వికారం, కంటి సమస్యలు, మానసిక గందరగోళం, చర్మం చల్లగా మారడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు లో బీపీ ప్రమాదకరంగా మారుతుంది. ఇవి శరీర అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉండటానికి సంకేతాలవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని రక్తనాళాలు గట్టిపడి, శరీరం రక్తపోటును నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. ఇప్పటికే గుండె జబ్బులు, గుండె వైఫల్యం లేదా వాల్వ్ సమస్యలు ఉన్నవారికి లో బీపీ గుండెపై మరింత ఒత్తిడిని కలిగించి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
అలాగే.. డయాబెటిస్ ఉన్నవారి రక్తనాళాలు దెబ్బతినడం వల్ల రక్తపోటు నియంత్రణలో గందరగోళం ఏర్పడుతుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు (సెప్సిస్) లేదా షాక్ పరిస్థితుల్లో, రక్తపోటు ప్రమాదకరంగా తగ్గి, ముఖ్యమైన అవయవాలకు రక్తసరఫరా నిలిచిపోతే అవయవ వైఫల్యం (Organ Failure)కు దారితీయవచ్చు. అలాంటి సందర్భాల్లో తక్షణ వైద్య సహాయం అత్యవసరం.
లో బీపీకి ఎలా చెక్ పెట్టాలి ?
తక్కువ రక్తపోటు ఉన్నవారు శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం. రోజూ తగినంత నీరు తాగడం ద్వారా రక్త ప్రవాహం సజావుగా సాగుతుంది. వైద్యుల సూచన మేరకు ఉప్పు మితంగా కానీ తగినంతగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఉప్పు సోడియం అందించి రక్తపోటును కొంచెం పెంచుతుంది. ఒకేసారి ఎక్కువగా భోజనం చేయడం కన్నా, తరచూ తక్కువ పరిమాణాల్లో తినడం శ్రేయస్కరం. రక్తపోటును తగ్గించే మందులు వాడుతుంటే, వాటి ప్రభావం వల్ల బీపీ అనవసరంగా తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి డాక్టర్‌తో చర్చించి ఆ మందుల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలి.