రోజుకు కేవలం 20 నిమిషాలు నడిస్తే.. ఇన్ని ప్రయోజనాలా?
Walking: ఫిట్‌గా, హెల్తీగా ఉండాలంటే గంటల తరబడి జిమ్ లో చెమటలు కక్కాల్సిన అవసరం లేదు. అవును ప్రతిరోజూ కేవలం 20 నిమిషాలు నడవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రతి రోజు 20 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రోజూ నడక
రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది కూర్చుని పనిచేయడం అలవాటు చేసుకున్నారు. శారీరక శ్రమ తగ్గింది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత శారీరక శ్రమ అవసరం. అందుకే రోజూ ఏదో ఒక వ్యాయామం చేయమని వైద్యులు సూచిస్తున్నారు. కానీ అందరూ వ్యాయామాలు చేయలేరు. దానికి ప్రత్యామ్నాయంగా నడకను సూచిస్తున్నారు. అన్ని వయసుల వారు చేయగల సులభమైన వ్యాయామం నడక. రోజూ ఉదయం కేవలం 20 నిమిషాలు నడిచినా పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఉదయం నడక
ఉదయం నడక వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తపోటు తగ్గి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉదయం నడక సహాయపడుతుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. కీళ్ళు దృఢంగా, ఎముకలు, కండరాలు బలంగా ఉండటానికి నడక సహాయపడుతుంది. కేవలం 20 నిమిషాల నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.
బరువు నియంత్రణ
అధిక బరువు ఉన్నవారికి మెటబాలిజం సమస్యలు ఉండవచ్చు. దీన్ని సరిచేయడంలో నడక సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నడిస్తే అధికంగా ఉన్న కొవ్వు తగ్గి బరువు నియంత్రించబడుతుంది. అలాగే.. తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం మంచిది. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
గుండె ఆరోగ్యం
శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో నడక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా నివారిస్తుంది. సాయంత్రం నడక కంటే ఉదయం నడక చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి.
మానసిక ఆరోగ్యం
ఉదయం ఎండలో నడవడం వల్ల సూర్యకాంతి చర్మానికి తగిలి సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఉదయం నడక వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఎండార్ఫిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నిద్ర
నిద్రలేమి అనేక వ్యాధులకు మూలం. మంచి నిద్ర అనేక వ్యాధులకు చికిత్స. మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి రోజూ ఉదయం కనీసం 20 నిమిషాలు వేగంగా నడవడం మంచిది. ఉదయం ఎండలో నడవడం వల్ల శరీరంలోని సర్కేడియన్ రిథమ్ సరిగ్గా పనిచేస్తుంది. రాత్రి బాగా నిద్రపడుతుంది. దీనివల్ల ఉత్సాహంగా రోజును ప్రారంభించవచ్చు.