Immune System: రోగనిరోధక శక్తిని పెంచే వ్యాయామాలు ఇవే..!
Immunity Boosting Exercises: ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి రక్షిస్తుంది. సరైన ఆహారం తీసుకోవడం వల్లనే కాదు.. వ్యాయామం కూడా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచే 5 వ్యాయామాల గురించి తెలుసుకోండి.

రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే.. మనకు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు దరిచేరవు. రోగనిరోధక శక్తిని పెంచడానికి పోషకమైన ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేకపోవడం వంటివి అవసరం. అలాగే శారీరక శ్రమ కూడా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మన రోగనిరోధక శక్తిని పెంచే వ్యాయామాలు గురించి తెలుసుకుందాం.
నడక
చురుగ్గా నడవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతిరోజూ 30 నిమిషాలు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎండలో నడిస్తే ఎముకలకు అవసరమైన విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు కూడా అవసరమైన పోషకం.
యోగా
యోగా చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్లు పెరగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం మెరుగుపడుతుంది. చైల్డ్స్ పోజ్, డౌన్‌వర్డ్ డాగ్, బ్రిడ్జ్ పోజ్ వంటి ఆసనాలు చేయండి.
వ్యాయామాలు
వ్యాయామం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రధానంగా బరువులు ఎత్తడం, స్క్వాట్స్, పుష్-అప్స్ వంటివి రోగనిరోధక కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
ఈత
ఈత శరీరానికి ఉత్తమైన వ్యాయామం. స్విమింగ్ చేయడం వల్ల కీళ్ళు, గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి మంచి వ్యాయామం ఈత. ఈత కొట్టేటప్పుడు మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి, దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
డ్యాన్స్
డ్యాన్స్ చేయడం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది, ఇది శరీరంలో రోగనిరోధక కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది. డ్యాన్స్ చేసేటప్పుడు మానసిక స్థితి సరిగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటివి తగ్గించడానికి డ్యాన్స్ సహాయపడుతుంది.