Fever: జ్వరం వస్తే నోరు చేదుగా ఎందుకు మారుతుంది.? ఏది ఎందుకు రుచించదో తెలుసా
Fever: జ్వరం సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య. వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఇతర వ్యాధుల కారణంగా జ్వరం వస్తుంది. అయితే చాలా మంది జ్వరం తగ్గిన తర్వాత కూడా నోటిలో చేదుగా ఉంటుంది. ఇంతకీ పరిస్థితి ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా తగ్గించుకోవాలి? తెలుసుకుందాం

జ్వరం వచ్చినప్పుడు శరీరంలో జరిగే మార్పులు
జ్వరం అంటే కేవలం వ్యాధి కాదు. అది మన శరీరం సంక్రమణలతో పోరాడుతున్న సంకేతం. వైరస్ లేదా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వాటిని ఎదుర్కోవడానికి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ సమయంలో అలసట, ఆకలి తగ్గడం, నోటిలో చేదు రుచి రావడం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం తగ్గిన తర్వాత కూడా కొంతమందికి ఈ చేదు రుచి ఒకటి లేదా రెండు రోజులు కొనసాగుతుంది.
రుచి ఎందుకు మారుతుంది.?
డాక్టర్లు చెప్పే ప్రకారం జ్వరం తర్వాత నోటిలో చేదు రుచి రావడానికి డిస్గ్యూసియా (Dysgeusia) అనే సమస్య ఒక కారణం. దీని అర్థం రుచిలో మార్పు రావడం. జ్వరం వచ్చిన సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనినే మనం డీహైడ్రేషన్‌గా చెబుతుంటారు. శరీరంలో నీరు తగ్గిపోతే నోటిలో లాలాజలం తగ్గుతుంది, నోరు ఎండిపోతుంది, బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ కారణాల వల్ల నోటిలో చేదు రుచి ఎక్కువగా అనిపిస్తుంది.
మందులు, జలుబు కూడా కారణం కావచ్చు
జ్వరం వచ్చినప్పుడు చాలా మంది యాంటీబయోటిక్ మందులు లేదా ఇతర ఔషధాలు తీసుకుంటారు. ఈ మందులు కొన్నిసార్లు నోటిలో చేదు రుచి కలిగించవచ్చు. అదే సమయంలో జలుబు లేదా సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే ముక్కు మూసుకుపోతుంది, గొంతులో ద్రవం చేరుతుంది, వాసన, రుచి భావన తగ్గుతుంది. ముక్కు మూసుకుపోయినప్పుడు చాలా మంది నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. దీని వల్ల నోరు త్వరగా ఎండిపోతుంది. ఫలితంగా నోటిలో బ్యాక్టీరియా పెరిగి చేదు రుచి ఎక్కువగా ఉంటుంది.
ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు
కొన్ని సందర్భాల్లో నోటిలో చేదు రుచి రావడానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. నోటిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్, నాలుకపై తెల్లటి పొర రావడం, లివర్ సమస్యలు, జీర్ణ సమస్యలు వంటి వాటివల్ల కూడా నోరు చేదుగా మారుతుంది.
నోటిలో చేదు రుచి తగ్గాలంటే..
జ్వరం తర్వాత నోటిలో చేదు రుచి తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. చక్కెర లేని చ్యూయింగ్ గమ్ నమలవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి పుకిలించాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. అలాగే అలాగే జ్వరం ఉన్న సమయంలో
ఎక్కువ మసాలా ఉన్న ఆహారం తీసుకోకూడదు. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. నోటిలో చేదు రుచి ఒక వారం కంటే ఎక్కువగా కొనసాగితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అది ఇతర ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

