Health Tips: అరటి పండు తిన్నాక నీళ్లు తాగుతున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
చిన్నా, పెద్దా ఇష్టంగా తినే పండ్లల్లో అరటి ముందు వరుసలో ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి చాలామంది అరటి పండ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగడం మంచిదో.. కాదో.. ఇక్కడ తెలుసుకుందాం.

అరటి పండులోని పోషకాలు
అందరికీ సులభంగా దొరికే పండ్లలో అరటి ఒకటి. ఇది ఒక సూపర్ ఫుడ్. చాలా తక్కువ ధరకు అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. అరటిపండులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రతిరోజూ ఉదయం ఒక అరటిపండు తినాలని వైద్యులు చెబుతుంటారు. అరటిపండులో కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే చాలామంది అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగుతుంటారు. అలా తాగడం మంచిదో.. కాదో.. ఇక్కడ తెలుసుకుందాం.
అరటి తిన్నాక నీళ్లు తాగొచ్చా?
చాలామందికి అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ అది మంచిది కాదు. అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు సమస్యలు పెరుగుతాయి. అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల అది నీటితో కలిసి జీర్ణ సమస్యలను సృష్టిస్తుంది. కడుపులో ఆమ్లతను పెంచుతుంది. దీనివల్ల ఎసిడిటీ, వాపు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
అరటి తిన్నాక ఎప్పుడు నీళ్లు తాగాలి?
అరటిపండు తిన్నాక దాదాపు అరగంట తర్వాత నీళ్లు తాగాలి. అప్పుడే అరటి పండులోని అన్ని పోషకాలను పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది.
అరటి తినడానికి సరైన సమయం ఏది?
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండును ఉదయం అల్పాహారంలో తినవచ్చు. అలాగే దీన్ని పెరుగు వంటి ఎక్కువ కొవ్వు, ప్రోటీన్ ఉన్న ఆహారాలతో కలిపి తీసుకోవచ్చు.
అరటి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
అరటిపండులో ఉండే పొటాషియం ఒత్తిడి హార్మోన్‌ను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ సి కళ్లు, చర్మానికి మేలు చేస్తాయి.