Liver : మీలో లక్షణాలున్నాయా? అయితే.. కాలేయ సమస్య కావచ్చు!
Liver Damage: ప్రతి వ్యాధి వచ్చే ముందు మనంలో కొన్ని స్పష్టమైన లక్షణాలను ముందుగానే చూపిస్తాయి. అలాగే.. కాలేయ సమస్యలు ఉంటే కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ లక్షణాలేంటీ? కారణాలేంటో తెలుసుకుందాం.

సిర్రోసిస్ వ్యాధి
మన శరీరంలోని అన్ని అవయవాలలో కాలేయం ( LIVER) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణక్రియ, హార్మోన్ల ఉత్పత్తి, రక్త శుద్ధి వంటి కీలకమైన ప్రక్రియలను నిర్వహిస్తుంది. కొద్దిగా నష్టం జరిగినా, ఈ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. కాలేయానికి సంబంధించిన ముఖ్యమైన వ్యాధుల్లో సిర్రోసిస్ (Cirrhosis) అత్యంత ప్రమాదకరమైనది. దీనికి సంబంధించిన 7 ముఖ్య లక్షణాల్లో కళ్లు పసుపు రంగులోకి మారడం ఒకటి. అయితే.. ఈ లక్షణాన్ని అనేక మంది విస్మరిస్తారు. ముఖ్యంగా.. ఈ లక్షణాలను తొందరగా గుర్తించి వైద్య సలహా తీసుకోవాలి.
తీవ్ర అలసట
కాలేయం శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది బాగా పనిచేయకపోతే, శక్తి స్థాయి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో ఉన్నవారికి ఎప్పుడూ తీవ్ర అలసట, బలహీనత ఉండటం సాధారణం. తక్కువ పని చేసినా శరీరం బలహీనంగా, అలసినట్లు అనిపిస్తే అది కాలేయం ఆరోగ్యం బాగోలేనన్న సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాలపాటు కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కాలేయ సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తిస్తే, చికిత్స సులభంగా ఉంటుంది.
బరువు తగ్గుదల
కాలేయం దెబ్బతినడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఆహారాన్ని సరైనవిధంగా జీర్ణించకపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది, దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందక, బరువు వేగంగా తగ్గడం మొదలవుతుంది. ఇది శరీరం బలహీనతకు దారి తీస్తుంది. ఇలాంటి మార్పులు గమనిస్తే.. కాలేయ వ్యాధుల సంకేతంగా తీసుకొని వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం.
కంటిలో కనిపించే లక్షణాలు
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. కాలేయం సరిగా పనిచేయకపోయే పరిస్థితిలో, ముఖ్యంగా సిర్రోసిస్ వచ్చినప్పుడు, కంటి తెల్ల భాగం పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు, చర్మం కూడా పసుపు రంగులోకి మారవచ్చు, దీనిని వైద్యపరంగా "జాండ్‌డిస్" లేదా "కామెర్లు" అని అంటారు.
ఉబ్బరం
కాలేయ సిర్రోసిస్ ఉన్నవారిలో సాధారణంగా కడుపులో ద్రవం చేరడం ప్రారంభమవుతుంది, దీనిని వైద్యపరంగా అసిటీస్ (Ascites) అంటారు. కడుపు ఉబ్బినట్లు, వాచినట్లుగా అనిపిస్తుంది. ద్రవం అధికమైతే నడవడంలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. కొన్నిసార్లు కడుపు నొప్పి కూడా తలెత్తుతుంది. ఇది కాలేయ సంబంధిత సమస్య సంకేతం కావచ్చు.
రక్తస్రావం
కాలేయం ముఖ్యమైన పనుల్లో రక్తం గడ్డకట్టే ప్రోటీన్‌లను ఉత్పత్తి చేయడం. ఈ ప్రాసెస్ సరిగ్గా జరగకపోతే.. చిన్న గాయం కూడా ఎక్కువ రక్తస్రావానికి కారణమవుతుంది. ఇంకా, అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కాలేయ పనితీరులో లోపం ఉన్నప్పుడు తలెత్తుతాయి.
మెదడుపై ప్రభావితం
కాలేయం సరిగా పనిచేయకపోతే, రక్తంలో విషపదార్థాలు చేరి మెదడును ప్రభావితం చేస్తాయి. దీంతో చేతులు వణకడం, భ్రమలు, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది తీవ్రమైన కాలేయ సమస్యకు సంకేతం.
చర్మంపై ఎర్ర మచ్చలు
కాలేయ సిర్రోసిస్ కారణంగా చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు లేదా గీతలు కనిపించవచ్చు. వీటిని "స్పైడర్ ఏంజియోమాస్" అని కూడా అంటారు. ఇవి ముఖ్యంగా ముఖం, ఛాతీ, మెడ, చేతులపై ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా ఎర్ర మచ్చలు కనిపిస్తే కాలేయ సమస్యల సంకేతంగా భావించి వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.